అన్నీ అబద్ధాలే...! అనుకున్న సమయానికే గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కోసం అభిమానలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి వస్తోన్న ఒక్కో అప్ డేట్ మొదట్లో అభిమానులకు పూనకాలే తెప్పించాయి. కానీ, క్రమంగా అప్ డేట్స్ కాస్త్ మందగించడంతో పుకార్లు షికార్లు చేశాయి. గుంటూరు కారం స్టార్ క్యాస్ట్ లో లెక్కలేనన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను సినిమానుంచి తప్పించేశారని బోలెడన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. అక్కడితో సరిపెట్టుకోని రూమర్లు మరో అడుగు ముందుకేసి సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే తప్పకుందని టాలీవుడ్ లో షికార్లు చేశాయి. ఆ తరువాత ఏకంగా డైరెక్టర్ త్రివిక్రమ్ కు, మహేశ్ బాబుకు ఒకరంటే మరొకరికి పడటం లేదని, సినిమా దాదాపూ ఆగిపోయినట్లే అనేంత వరకూ వచ్చింది పరిస్థితి. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని గుంటూరు కారం టీమ్ ఒకే ఒక్క మాటతో తేల్చి పారేసింది. మహేశ్ బాబు మాస్ అవతారంలో పెద్ద పండక్కి బాక్సాఫీస్ షేక్ చేయడం గ్యారెంటీ అని కన్ఫామ్ చేసింది. వచ్చే యేడాది సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అవ్వబోతోందని స్పష్టం చేసింది. ముఖ్యంగా తమన్ సినిమా నుంచి తప్పుకున్నారు అన్న మాట పచ్చి అబద్ధమని రూఢీ చేసింది. ఈ నెల 24 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమవ్వనుంది. జనవరి 13 న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక వేళ ప్రాజెక్ట్ కె కూడా అదే సమయానికి విడుదలవుతుంది అంటే.... గుంటూరు కారం సినిమాను ఒక రోజు ముందుగానే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి, ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటూ, పుకారు రాయుళ్లు సైతం నిశ్చింతగా ఉండచ్చు అన్నమాట.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com