HBD Allu Aravind : మెగా ప్రొడ్యూసర్ కి బర్త్ డే విషెస్!

HBD Allu Aravind : మెగా ప్రొడ్యూసర్ కి బర్త్ డే విషెస్!
నిర్మాత టాలెంట్ అయినా డబ్బులు పెట్టడంలో కాదు.. స్టోరీ సెలెక్షన్ లోనే తెలుస్తుంది. ఆ విషయంలో అల్లు అరవింద్ ను పర్ఫెక్ట్ సెలెక్టర్ గా చెప్పొచ్చు.

అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అల్లు అరవింద్.. తండ్రిలా నటుడు కాలేకపోయాడు కానీ ఆయన స్థాపించిన నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్ ను మంచి విజయాలతో పరిశ్రమలో పెద్ద గీతగా మలిచిన ప్రతిభావంతమైన నిర్మాత అరవింద్. చిరంజీవి బావమరిదిగా ఆయనకు చేదోడువాదోడుగా నిలిచి ఎంటైర్ మెగా హీరోలకు పెద్ద తలలా వ్యవహరిస్తోన్న అల్లు అరవింద్ పుట్టిన రోజు ఇవాళ. నిర్మాతగా, ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా తిరులేకుండా దూసుకుపోతోన్న అల్లు అరవింద్ కు బర్త్ డే చెబుతూ ఆయన సినీ కెరీర్ ను ఓ సారి చూద్దాం..

ఏ నిర్మాత టాలెంట్ అయినా డబ్బులు పెట్టడంలో కాదు.. స్టోరీ సెలెక్షన్ లోనే తెలుస్తుంది. ఆ విషయంలో అల్లు అరవింద్ ను పర్ఫెక్ట్ సెలెక్టర్ గా చెప్పొచ్చు. అల్లు రామలింగయ్య గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించిన తొలినాళ్లలో నిర్మించిన సినిమాలు పూర్తిగా ఆయన అభిరుచిని ప్రతిబింబించినవే.. తర్వాత ఆ అభిరుచినీ తానూ అందిపుచ్చుకుని తనదైన శైలిలో దూసుకుపోతూ మెగా ప్రొడ్యూసర్ గా మారాడు అరవింద్. ముందు నుంచీ సినిమా వాతావరణంలో ఉండటం వల్లనో ఏమో.. అల్లు అరవింద్ కు స్టోరీ జడ్జిమెంట్ కెపాసిటీ అలా వచ్చేసిందంతే. అందుకే ఆయన తొలినాళ్లలో నిర్మించిన సినిమాల్లో అటు ఆర్టిస్టిక్ ఇటు కమర్షియల్ గానూ టచ్ చేసే కథల్ని సెట్ చేసుకున్నాడు.

అందుకే దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్, రాఘవేంద్రరావు, విజయాబాపినీడు, కోదండరామిరెడ్డి వంటి వైవిధ్యమైన దర్శకులతో సినిమాలు నిర్మించి మంచి విజయాలు సాధించారు. అల్లు వారి ఫ్యామిలీలోకి చిరంజీవి అల్లుడిగా వెళ్లిన తర్వాత వీరి బంధం సినిమా పరంగానూ బాగా బలపడింది.. దీంతో అరవింద్ బయటి హీరోల కంటే ఎక్కువగా చిరంజీవితోనే సినిమాలు చేశారు. అడపాదడపా బయటి హీరోలతో చేసినా చిరంజీవితో చేసిన కిక్ మాత్రం వేరే. విచిత్రం ఏంటంటే.. బిగెనింగ్ డేస్ లో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు మరీ పెద్ద బ్లాక్ బస్టర్లేం కాదు.

కానీ చిరంజీవిలోని నటుడ్ని మాత్రం బాగా ఎలివేట్ చేసిన విజేత, పసివాడి ప్రాణం, ఆరాధన, చక్రవర్తి వంటి సినిమాలు చాలానే ఉన్నాయి.. అల్లు అరవింద్, చిరంజీవిలది బంధుత్వాన్ని మించిన స్నేహం. అందుకే గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించిన తర్వాత యమకింకరుడు నుంచి మెకానిక్ అల్లుడు వరకూ.. అంటే 1982 నుంచి1993 వరకూ మొత్తం పదకొండు సినిమాలు కంటిన్యూస్ గా చిరంజీవితోనే నిర్మించడం విశేషం. చిరంజీవి బయటి బ్యానర్స్ లో కంప్లీట్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నా ఈ బ్యానర్ లో మాత్రం కమర్షియల్ తో పాటు మరికొన్ని తమ అభిరుచికి అనుగుణమైన సినిమాలు చేయడం.

అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చాలానే ఉన్నాయి.. పసివాడిప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు వంటి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇక మరో రకంగా చెప్పాలంటే రౌడీ అల్లుడు తర్వాత చిరు, అల్లు అరవింద్ కాంబినేషన్ లో మళ్లీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ రాలేదనే చెప్పాలి. ఇక ఈ పదకొండు సినిమాల్లో చివరగా వచ్చిన మెకానిక్ అల్లుడు బాగా నిరాశపరిచింది. అక్కినేని నాగేశ్వరరావుతో చిరంజీవి చేసిన సినిమాగా భారీ అంచనాలున్నా వాటిని అందుకోలేకపోయాడు ఈ మెకానిక్ అల్లుడు.

మెకానిక్ అల్లుడు తర్వాత మరో ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ఈ బ్యానర్ నుంచే వచ్చింది. ఆ సినిమా తర్వాత అందులో నటించిన హీరో ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన పనిలేకపోయింది. అప్పటి వరకూ విలన్ గా, చిన్నా చితకా పాత్రలు చేస్తోన్న ఆ హీరో శ్రీకాంత్. సినిమా పెళ్లి సందడి. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి నిర్మాణంలో అశ్వనీదత్ తో పాటు రాఘవేంద్రరావు కూడా భాగస్వామి కావడం విశేషం.

ఇక తెలుగు సినిమా చరిత్రలో కొత్త పేజీకి శ్రీకారం చుట్టింది కూడా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానరే. 1996లో ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ఆ హీరో మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో పవన్ ను పరిశ్రమకు పరిచయం చేసింది అల్లు అరవిందే. సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయినా.. పవన్ స్టామినాను ప్రూవ్ చేసింది.

ఒక్కో సినిమా సంగతి ఎలా ఉన్నా అల్లు అరవింద్ అంటే ప్లానింగ్ ఉన్న నిర్మాత. కథను బట్టి మాత్రమే బడ్జెట్ లెక్కలు వేసుకునే ఖచ్చితమైన నిర్మాత. స్టార్స్ కోసమో.. కాస్ట్ ను బట్టో బడ్జెట్ పెంచడం తెలియదాయనకు. అందుకే మెగాస్టార్ బావమరిది అన్నట్యాగ్ నుంచి మెగా ప్రొడ్యూసర్ అన్న పేరుకు వచ్చాడు. ఒక నిర్మాత ఎలా ఉండాలి అనే విషయంలో అరవింద్ గారు ఎంతో మంది ఔత్సాహిక నిర్మాతలకు ఆదర్శంగా నిలుస్తారనడంలో డౌటే లేదు.

నిర్మాతగా భాగస్వామ్య పద్ధతిలో సినిమాలు తీయడం మొదలుపెట్టారు అల్లు అరవింద్. అశ్వనీదత్, రాఘవేంద్రరావు వంటి వారు కూడా కలిసి రావడంతో ఈ ముగ్గురూ కలిసి కొన్ని సినిమాలు నిర్మించారు. అయితే ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు. కారణం సినిమాలు బాలేకపోవడమే. అయితే తన కొడుకు అల్లు అర్జున్ ను హీరోగా పరిచయం చేసిన సినిమా మాత్రం అనూహ్య విజయం సాధించింది. రాఘవేంద్రరావు వందో సినిమా బన్నీ తొలి సినిమాగా తెరకెక్కిన గంగోత్రి ఈ ముగ్గురికీ లాభాల పంట పండించింది.

తను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా మారిన తర్వాత మరో సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమాకున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. దీనికి పవనే దర్శకుడు. అర్థమైది కదా అది జానీ అని. బట్ సినిమా రిజల్ట్ తీవ్రంగా నిరాశపరిచింది. తర్వాత చిరంజీవితో చేసిన అందరివాడు యావరేజ్ అనిపించుకుంటే.. తనయుడు అల్లు అర్జున్ తో చేసిన హ్యాపీ అంత సంతోషాన్నివ్వలేకపోయింది.. మరి పవన్ కళ్యాణ్ కో బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయానన్న కసో లేక మరేంటో కానీ.. అప్పటికి పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్న టైమ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి జల్సా తీశాడు. ఇది పవన్ కు ఎంత ఊరటనిచ్చిందో అందరికీ తెలుసు. అయితే పవన్ కు హిట్ ఇవ్వాలని కాదు కానీ.. చాలా వరకూ అతని జడ్జిమెంట్ ఇచ్చిన ఫలితమే ఇది.

తెలుగులో తొలి భారీ బడ్జెట్ సినిమా. హీరోకు ఒక్క సినిమా వయసే. కేవలం దర్శకుడిని, అతను చెప్పిన కథను నమ్మి తీసిన సినిమా మగధీర. తెలుగులో ఇలాంటి సినిమాలు సాధ్యమా అన్న ప్రశ్నకు ఆన్సర్ గా వచ్చిన ఈసినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ మైల్ స్టోన్ లాంటిది. అల్లు అరవింద్ కాకుండా మరెవరూ డేర్ చేయలేని సినిమా ఇది. అతని ధైర్యానికి ఫలితం.. ప్రతి హీరో, దర్శకుడు కెరీర్ లో ఒక్కసారైనా మగధీర వంటి సినిమా చేయాలని కలలు కంటుండటమే.. గీతా ఆర్ట్స్‌కి విజయాలు కొత్త కాదు. అల్లు అరవింద్‌ ట్రెండ్‌కి తగ్గట్టు అప్‌డేట్‌ అవుతూ తన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా చూసుకుంటారు. మగధీర తర్వాత కొన్ని సినిమాలు ఇబ్బంది పెట్టినా గతేడాది హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. అయితే ఈ మూడూ దేనికదే భిన్నమైన కథ, కథనాలతో వచ్చినవి కావడం విశేషం. ఇద్దరు తనయులకు భారీ హిట్లుగా నిలిచిన శ్రీరస్తు శుభమస్తు, సరైనోడుతో పాటు మేనల్లుడు రామ్ చరణ్ కు ధృవ వంటి మెమరబుల్ హిట్ అందించాడు.

అల్లు అరవింద్ సినిమా అంటే ప్యాషనేట్ గా ఉంటారో అంత జాగ్రత్తగానూ ఉంటారు. కథను ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాడో బిజినెస్ నూ అంత పక్కాగా చూసుకుంటాడు. అందుకే ఫ్యామిలీలోనే పెద్ద హీరోలున్నా.. కథను బట్టి భలేభలే మగాడివోయ్ వంటి సినిమాకు నానిని సెలెక్ట్ చేసుకున్నాడు. బ్లాక్ బస్టర్ అయింది. అన్నట్టు ఇదే సినిమాను కన్నడలోనూ నిర్మించి అక్కడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తెలుగుతో పాటు హిందీలో ఏడు సినిమాలు, తమిళంలో మూడు, కన్నడలో రెండు సినిమాలు నిర్మించాడు అల్లు అరవింద్. మరోవైపు కెరీర్ తొలినాళ్లలో అప్పుడప్పుడూ కేమియో రోల్స్ లో ఆర్టిస్ట్ గానూ మెరిసాడు. అయితే యాక్టింగ్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు.

చిరంజీవి ఎదుగుదల వెనక అల్లు అరవింద్ అనే పిల్లర్ చాలా ప్రధానమైనది కావడానికి కారణం ఆయన నటుడిగా కంటే నిర్మాతగా నిలిచిపోవడమే. ప్రస్తుతం మొత్తం మెగా ఫ్యామిలీ హీరోలకు అన్ని విషయాల్లో పెద్ద దిక్కుగా నిలుస్తూ.. అందరికీ సరైన సలహాలు ఇస్తూ.. తప్పు చేస్తే బహిరంగంగా విమర్శించడానికి కూడా వెనకాడకుండా.. ఓ రకంగా అందరికీ తండ్రి పాత్రలో కనిస్తున్నాడు. నిజానికి మెగా ఫ్యామిలీలో ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మిగతా అంతా ఒకే తాటిపై నిలవడానికి, నిలబెట్టడానికి వెనక అల్లు హస్తమే పెద్దది.. కొన్ని సార్లు విమర్శలు ఎదుర్కొన్నా.. అంతా తన కుటుంబం కోసమే కదా అనేది ఆయన ఫీలింగ్. ఏదేమైనా ఓ మెగా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకి ఎన్నో మెమరబుల్ హిట్స్ అందించి.. అందిస్తోన్న అల్లు అరవింద్ కు మరోసారి హ్యాపీ బర్త్ డే చెబుదాం..

- బాబురావు. కామళ్ల

Tags

Read MoreRead Less
Next Story