MAA Elections process : 'మా' ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది... గెలిస్తే చేయాల్సిన పనులేంటి?

MAA Elections process : మరికొద్ది గంటల్లో జరగనున్న 'మా' ఎన్నికల పైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా ప్రకాశ్‌రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ ఒకరిపైన ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. పేరుకే మా ఎన్నికలు కానీ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇంతకీ మా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది.. అధ్యక్షుడిని, కార్యవర్గ సభ్యులను ఎలా ఎన్నుకుంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
ప్యానల్‌లో ఎవరెవరు ఉంటారు..
రెండేళ్ళకొకసారి మా ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు ట్రెజరర్, 18 మంది ఈసీ మెంబర్లతో కలిపి మొత్తం 26 మందితో అసోసియేషన్ ఉంటుంది. వీరు 'మా' అసోసియేషన్ కార్యకలాపాలను నిర్వహిస్తారు. వీరిని 'మా' లో సభ్యత్వం ఉన్నవారు ఎన్నుకుంటారు.
ఆసక్తికరంగా ఓటింగ్...
ఓటింగ్ ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.. ఒక్కో ఓటరు మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాలి.. పోటీ పడుతున్న ప్యానెల్ సభ్యుల్లో అధ్యక్షుడి నుంచి జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, ఈసీ సభ్యుల వరకు తమకి నచ్చిన వారికి ఓటేయాలి.. అంటే ఒక్కో ఓటరు 26 మందికి ఓటేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లెక్కింపులో మొత్తం పోలైన ఓట్లలో ఎవరికీ ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. రెండు ప్యానల్‌లో గెలిచిన అభ్యర్థులు చివరికి ఒకే ప్యానల్ గా మారుతారు. అధ్యక్షుడిగా ఎవరైతే వారి దగ్గర మిగతా సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది.
రేపు పోలింగ్..
మా ఎన్నికలకి రేపు (అక్టోబరు 10) ఆదివారం ఉదయం 8 గంటలకి పోలింగ్ మొదలై.. మధ్యాహ్నం 2గంటల వరకూ జరుగుతుంది.. మొత్తం 'మా'లో 925 మంది సభ్యులున్నారు.. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవ్వగా... రాత్రి వరకు ఫలితాలు రానున్నాయి.
గెలిచిన వారు చేయల్సిన బాధ్యతలు..
ఎన్నికల్లో గెలిచిన వారు సభ్యుల సంక్షేమం, ఆరోగ్యం కోసం పనిచేయాల్సి ఉంటుంది. సభ్యుల పింఛన్లు, హెల్త్ ఇన్సూరెన్స్, ఎవరైనా చనిపోతే వారికీ రావాల్సిన భీమా ఇప్పించడం, ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో చూడడం, సభ్యులకి సినిమా అవకాశాలు ఇప్పించడం, అసోసియేషన్‌కి నిధులు సమీకరించేందుకు కార్యక్రమాలు నిర్వహించడం చేయాల్సి ఉంటుంది. ఇలా రెండేళ్ళ పాటు ఎలాంటి వివాదాలకి పోకుండా, ఎలాంటి చెడ్డ పేరు రానివ్వకుండా అసోసియేషన్‌ని ముందుకు నడిపించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com