చనిపోతాననే ఆలోచనలు.. కామెంట్ చేసే ముందు ఒకసారి..: తమన్నా

టాలీవుడ్ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు.. కరోనా సోకిన విషయం తెలిసి మానసికంగా చాలా వత్తిడికి గురైనట్లు తమన్నా తాజాగా వివరించారు. చికిత్స తీసుకుంటున్నప్పుడు ఎంతో భయపడ్డాను.. ఆ టైమ్‌లో చనిపోతాననే ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి. కరోనాకు సంబంధించిన లక్షణాలు నాలో తీవ్రంగా కనిపించాయి. కానీ వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో నేను బ్రతికి బయటపడ్డాను.
అలాంటి క్లిష్టపరిస్థితుల్లో నాకెంతో సపోర్టుగా నిలిచిన నా తల్లిదండ్రులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. జీవితం ఎంత విలువైందో అలాంటి సమయాల్లోనే తెలుస్తుంది.. ఇక కరోనాకు చికిత్స తీసుకునే సమయంలో వేసుకున్న కొన్ని మందుల కారణంగా నేను కొద్దిగా లావయ్యాను. ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేస్తే.. అది చూసి లావుగా ఉన్నానని కొందరు కామెంట్ చేశారు. ఒకరి గురించి అనేటప్పుడు.. అసలు ఏమైంది.. ఎందుకు అలా ఉన్నారు.. అనేది ఆలోచించకుండా వారిలో ఉన్న లోపాలు మాత్రం వెతుకుంటారనే విషయం అప్పుడు నాకు అర్థమైంది అని తమన్నా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.
కాగా, ప్రస్తుతం తమన్నా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న 'సీటీమార్' చిత్రంలో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గోపీ చంద్ కథానాయకుడు. అలాగే నితిన్ కథానాయకుడిగా ఓ రీమేక్ చిత్రం 'అంధాదున్' లో తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్‌తో మరో చిత్రం 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలో నటిగా తమన్నాను ఎంపిక చేశారు చిత్ర యూనిట్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com