కొరిపాటపాడు శ్మశాన వాటికలో ముగిసిన జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలు

గుండెపోటుతో మృతిచెందిన టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలు గుంటూరు జిల్లా కొరిపాటపాడు శ్మశాన వాటికలో జరిగాయి.. ఆయన మరణ వార్త విని టాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. మరికొందరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాష్‌రెడ్డి విలనిజానికి కొత్త అర్థం చెప్పారు. ప్రేమించుకుందాం.. రా సినిమాతో మొదలుపెట్టి అనేక సినిమాల్లో రాయలసీమ మాండలికంతో ఆయన పాపులర్ అయ్యారు. ఇక కామిడీ విషయంలోనూ ఆయన టైమింగుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిక్, ఢీ, రెడీ, కృష్ణ, ఛత్రపతి, రచ్చ, రేసుగుర్రం, నాయక్, బాద్‌షా, టెంపర్, పటాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాల్లో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాయలసీమే కాదు తెలంగాణ మాండలికాల్ని కూడా అద్భుతంగా పలికించిన ఘనత ఆయన సొంతం..
విలన్‌గా సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు సహా అనేక చిత్రాల్లో నటించారు. దాదాపుగా అవన్నీ బాక్సాఫీస్ సూపర్‌హిట్లే. నాటకరంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన జయప్రకాష్‌రెడ్డి1988లో టాలీవుడ్‌లోకి వచ్చారు. బ్రహ్మపుత్రుడు ఆయన తొలి సినిమా. ఐతే.. 1997లో ప్రేమించుకుందాం రా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. మాటల్లో విరుపులు, తనదైన యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారాయన. భారీకాయంతో కనిపించినా అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లె జయప్రకాష్‌రెడ్డి స్వస్థలం. ఆయన మరణవార్తతో స్థానికంగాను విషాద ఛాయలు నెలకొన్నాయి. 1946 మే 8వ తేదీన జన్మించిన ఆయన వయసు 74 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నాటకరంగంపై ఆసక్తే ఆయన్ను టాలీవుడ్‌కు తీసుకొచ్చింది. కాలేజీ రోజుల్లో సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలన్నీ చూస్తూ.. నటనపై విపరీతమైన ఇష్టాన్ని చాటుకునేవారు. మొదట్లో మున్సిపల్ హైస్కూల్‌లో పనిచేసినా.. తర్వాత పూర్తిగా నాటకాల్లోకి వచ్చేశారు. అలెగ్జాండర్ అనే నాటకాన్ని ఆయన కొన్ని వందల సార్లు ప్రదర్శించారు. ఇవాళ గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందడం ప్రేక్షకలోకంలో విషాదం నింపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com