Karthavyam: 'కర్తవ్యం' చిత్రానికి 32 ఏళ్లు.. విజయశాంతి స్పెషల్ పోస్ట్..

Karthavyam: కొన్ని సినిమాలు విడుదలయ్యి ఎన్నేళ్లయినా.. వాటిని ప్రేక్షకులు మర్చిపోలేరు. ఎందుకంటే అవి వారి మనసులపై అంత బలమైన ముద్ర వేస్తాయి కాబట్టి. అలాంటి చిత్రాల్లో 'కర్తవ్యం' ఒకటి. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ల్యాండ్ మార్క్ కావడంతో ఈ మూవీలో దర్శకుడు మోహన్ గాంధీ చెప్పాలనుకున్నది ప్రేక్షకులకు ఇంకా బలంగా రీచ్ అయ్యింది. తాజాగా కర్తవ్యం చిత్రం 32 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయశాంతి మరోసారి దీని గురించి గుర్తుచేసుకున్నారు.
1990లో విడుదల అయిన కర్తవ్యం సినిమా సంచనల విజయం సాధించింది. పైగా ఈ సినిమా బడ్జెట్ కోటి రూపాయలు కాగా.. విజయశాంతి కూడా దానికి సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ సినిమా కోసం విజయశాంతి ఏకంగా కోటి రూపాయలను పారితోషికంగా అందుకున్నారు. అప్పట్లో తెలుగులో స్టార్ హీరోలకు సైతం కోటి రూపాయల రెమ్యునరేషన్ లేదు. హీరోయిన్లకు అంత రెమ్యునరేషన్ అనేది అసాధ్యం అనుకుంటున్న రోజుల్లో విజయశాంతి ఆ మార్క్‌ను టచ్ చేసి చూపించారు. అంతే కాకుండా కర్తవ్యం చిత్రం అప్పట్లోనే రూ.7 కోట్ల వసూళ్లను సాధించింది.
ఇండియన్ ఫస్ట్ లేడీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ జీవిత చరిత్ర స్ఫూ్ర్తిగా కర్తవ్యం చిత్రం తెరకెక్కింది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయశాంతి కనిపించారు. అయితే ఒకానొక సమయంలో ఈ సినిమా ఆపేయాలని కొందరు ప్రయత్నించారని విజయశాంతి స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. కానీ ఎలాగైనా ఈ సినిమా ప్రేక్షకులకు చేరాలనే ఉద్దేశ్యంతో మూవీ టీమ్ వెనకడుగు వేయలేదట. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం కోసం విజయశాంతి.. స్వయంగా కిరణ్ బేడీని కలిశారట కూడా.
కేవలం తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లో కూడా కర్తవ్యం చిత్రం సూపర్ హిట్. అంతే కాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఈ సినిమా ప్రసారం జరిగింది. కర్తవ్యంలో విజయశాంతి పర్ఫార్మెన్స్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. *నా కర్తవ్యం సినిమా రిలీజ్ అయి నేటికి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు శుభాకాంక్షలు తెలియజేసిన నా అభిమానులకు ధన్యవాదాలు' అని కర్తవ్యం గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయశాంతి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com