Manchu Vishnu : బ్రదర్ మీరంటే నాకు అసూయ ..!
Manchu Vishnu On Allu Arjun : ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు మంచు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.. మా ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో ముచ్చటించిన విష్ణు.. ఇందులో మెగా హీరోలతో ఉన్న రిలేషన్స్ గురించి మాట్లాడారు. అందులో భాగంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. బన్నీ తనకు మంచి స్నేహితుడని, తరుచుగా తామిద్దరం చాట్ చేసుకుంటామని తెలిపాడు. ఓ సందర్భంలో అతన్ని చూస్తే అసూయ కలిగిందని, అదే సమయంలో గర్వంగా కూడా ఫీల్ అయ్యానని అన్నాడు.
ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'పుష్ప' త్వరలో రిలీజ్ కానుంది.. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్ధా' కూడా విడుదలకు సిద్దమైంది. దీనితో బాలీవుడ్ లోని ప్రముఖ వార్తాపత్రికలు అమీర్‌ఖాన్‌కి బన్నీ పోటీ ఇవ్వబోతున్నాడంటూ కథనాలు రాశాయి. అది చూసి బన్నీ అంటే అసూయ కలిగిందని, అదే సమయంలో ఓ తెలుగు హీరోగా గర్వపడ్డాను కూడా అని చెప్పుకొచ్చాడు. 'బ్రదర్, నేను నిన్ను చూసి అసూయపడుతున్నాను కానీ మీమ్మల్ని చూసి గర్వపడుతున్నా' అని బన్నీకి కూడా చెప్పినట్లుగా వెల్లడించాడు.
కాగా అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందాన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. రెండు భాగాలుగా వస్తోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com