Mangli Controversy: వివాదంలో మంగ్లీ ఆటాపాట

దక్షిణకాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో సినీ గాయకురాలు మంగ్లీ ఆటాపాట వివాదాస్పదంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా ముక్కంటి ఆలయంలో మంగ్లీ బృందం పాట చిత్రీకరించడం దుమారం రేపుతోంది. యూట్యూబ్‌లో విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగ్లీ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని భక్తులు మండిపడుతున్నారు.
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు నిత్యం అందుబాటులో ఉండే మీడియాను సైతం ఆలయ అధికారులు అనుమతించలేదు. భక్తులు సెల్‌ఫోన్లు, కెమెరాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతించరు. పరమ పవిత్రంగా భావించే ముక్కంటి ఆలయంలో మంగ్లీకి ఎలా అనుమతిస్తారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 2న దేవాదాయశాఖ కమిషనర్‌కు దామురెడ్డి అనే వ్యక్తి.. గరుడ ప్రొడక్షన్స్ పేరుతో షూటింగ్ చేసుకునేందుకు వినతిపత్రం అందించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 5, 6 తేదీలలో షూటింగ్ చేసేందుకు చకచకా అనుమతులు ఇచ్చారు ఆలయ అధికారులు. గరుడ ప్రొడక్షన్స్ పేరుతో అనుమతి తీసుకుని.. మంగ్లీని ఆటాపాటకు అనుమతి ఎలా ఇస్తారని భక్తుల ఆరోపిస్తున్నారు. యూట్యూబ్‌లో మంగ్లీ పాటను చూసేంతవరకు ఎందుకంత గోప్యంగా ఉంచారని విమర్శిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మంగ్లీ ఆటపాట చిత్రీకరణకు అనుమతులు ఇచ్చిన ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com