NTR Coin Release Event: నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవ రూపం…

NTR Coin Release Event: నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవ రూపం…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం

నందమూరి తారక రామారావు తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనం. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయనో ప్రభంజనం. ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవం, ఆయన తీరు రాజకీయ విశ్వరూపం. నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవ రూపం నాయకుడిగా ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం. తెలుగు జాతి ఆత్మగౌరవం హస్తిన వీధుల్లో పరాభవానికి గురవుతున్న సమయంలో ఢిల్లీ అహంకారంపై తిరుగుబావుటా ఎగరేసి, తల ఎత్తి తెలుగోడి సత్తా చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్. రాజకీయ వారసత్వం లేదు తాతలు, తండ్రుల చరిత్ర లేదు, ఉన్నదల్లా ప్రజాభిమానం ఒక్కటే. రంగేసుకునే వాళ్లకు రాజకీయాలేంటని విమర్శించిన నోళ్లనే ఔరా అనిపించేలా అడుగులేశారు.

ఎన్టీఆర్‌ ఏ పాత్ర చేసినా గుండెల‌కు హ‌త్తుకుంటుంది.. ఏ డైలాగు చెప్పినా ఆలోచింపజేస్తుంది. దేశం గ‌ర్వించ‌ద‌గిన న‌టుల‌లో అగ్రస్థానంలో ఉంటారు. ఆ పాత్ర ఈ పాత్ర అని లేదు. పౌరాణిక , జానప‌ద, సాంఘీక చిత్రాల‌లోని వైవిధ్యమైన మ‌ర‌పురాని పాత్రల‌కు ఆయ‌నే చిరునామా. రాముడైనా,రావణుసురుడైనా..కృష్ణుడైనా-ధుర్యోధనుడైనా.. కర్ణుడైనా-అర్జునుడైనా ఇలా ఏ పౌరాణిక పాత్ర పోషించినా ఆయ‌న‌దో ప్రత్యేకమైన శైలి. అందుకే తెలుగు వారి హృద‌యాల‌లో ఆరాధ్య దైవంగా నిలిచాడాయన. అన్నగారికి సినిమా అంటే ఇష్టం. నటన అంటే ప్రాణం. అదే తెలుగువారికి దక్కిన వరం. అందుకే నవరస నటనా సార్వభౌముడిని తెలుగు ప్రజలు చూడగలిగారు. రాముడైనా, కృష్ణుడైనా తెలుగు గడపకు ఎన్టీవోడే. కర్ణుడైనా, సుయోధనుడైనా, రావణుడైనా, నారాయణుడైనా, వెంకటేశ్వరుడైనా.. తెలుగింటి వెండితెర దేవుడు.. తారక రాముడు.

ఆహారం, ఆహార్యం, వాచకం, నవరసాల నటనా కౌశల్యం.. ఎక్కడా తగ్గలేదు. ఆయనకు పోటీగా ఎవరూ నెగ్గలేదు. అందుకే ఎన్టీఆర్ నటించిన ఒక్కో చిత్రం.. ఒక్కో పాఠం. ఒక్కో ఘట్టం.. మరపురాని అనుభవం. ఆయన ప్రస్థానమే... తెలుగు సినీ చరిత్రలో మరువలేని అధ్యాయం. ఎన్టీఆర్. ఈ మూడక్షరాలే తెలుగు సినీ జగత్తుకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. అన్నగారి మాట ఆచరణీయం. తారక రాముడి బాట అనుసరణీయం. అందుకే ఆయన వెండితెర ఇలవేల్పు అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు మరపురాని, మరువలేని సినీ కళాఖండాలను అందించారు. అందుకే తెలుగు చిత్రసీమ.. ఎన్నేళ్లయినా ఆయనకు రుణపడే ఉంటుంది. తెలుగు భాషా, సాంస్కృతిక వ్యాప్తికి జీవం పోసిన వ్యక్తిగా, శక్తిగా ఎన్టీఆర్ కు తెలుగు ప్రజల గుండెల్లో ఎన్నటికీ చెరిగిపోని స్థానముంటుంది. ఆయన ఆలోచనా విధానాలను, మాతృభాషపై ఆయనకున్న మమకారాన్ని కొనసాగించేలా ఇప్పటితరం కృషి చేయాల్సి ఉంది. అప్పుడే తెలుగుకు నిజమైన వెలుగు సాధ్యం.

ఎన్టీఆర్‌ ప్రతి మాట ఓ తూటాగా పేలింది. ఇదే సందర్బంలో ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు ఎన్టీఆర్‌. కాంగ్రెస్ పార్టీ వల్ల.. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిందనీ, దానిని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు.

శ్రామికుడి చెమటలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం.. ఆశీర్వదించండి అంటూ పార్టీని ప్రకటించారు. పార్టీ విధానం సోషలిజమా, నక్సలిజమా లేక సెక్యులరిజమా అని అడిగితే, హ్యూమనిజమ్ అంటూ బదులిచ్చారు.పార్టీని ప్రకటించి.. చైతన్య రథాన్ని సిద్దం చేసి..ఓట్లేయండని జనంలోకి వచ్చారు. ఆయనకి జనం నీరాజనాలు పలికారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను చాటారు.

అధికార పీఠం దక్కించుకోవడం కాదు… దాన్ని ప్రజలకు ఉపయోగ పడేలా సద్వినియోగం చెయ్యడం ఎలాగో అన్నగారిని చూసి నేతలంతా నేర్చుకోవాలి. అన్నగారు సీఎం అయ్యాక సంక్షేమ పథకాలకు కొత్త అర్థాన్నిచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు.ఎన్టీఆర్‌ తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఒక సంచలనం. ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ఓ ప్రభంజనం. అన్నగారు ప్రవేశ పెట్టిన పథకాల్లో ముఖ్యమైనది… మొదటిది… ఇప్పటికీ నేతలకు ఆదర్శంగా ఉన్నది రెండ్రూపాయల కిలో బియ్యం పథకం. ప్రతి పేదోడి కడుపూ నింపాలన్న సదాశయంతో రెండ్రూపాయలకే కిలో బియ్యమిచ్చి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్‌. పదవిలో ఉన్నంత కాలం ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు.

ఏసీ రూములు, కాన్ఫరెన్స్ హాళ్లలో మీటింగులు వంటివి అన్నగారి హయాంలో ఎక్కడా వినిపించలేదు. ఆయన ఎక్కడుంటే అక్కడే సచివాలయం. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం ఎన్టీఆర్ సొంతం ప్రాజెక్టుతో ఎంత మంది రైతులకు లబ్ది కలుగుతుందని అధికారుల్ని అడిగారు. వాళ్లు ఇన్ని వేల ఎకరాలకు నీరంది.. లక్షలాది మంది రైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పారట. అది విన్న అన్నగారు కనీసం ఖర్చెంత అవుతుందన్నది కూడా చూడకుండానే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ప్రజల మధ్యే పుట్టి, ప్రజలతోనే జీవించి, ప్రజల కోసమే జీవించి, ఆఖరికి ప్రజల మధ్యే కన్నుమూసిన మహానాయకుడు ఎన్టీఆర్‌. తెలుగువాడు అన్న మాటకు కేరాఫ్‌ అడ్రస్ ఎన్టీఆర్. అందుకే తెలుగు అన్న మూడక్షరాలున్నంత కాలం.. ఎన్టీఆర్ అన్న పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story