తాత మొండి తనం మనవడికి.. ఏం కాదంటూ 'తారక్'..
నందమూరి నట వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడనిపించుకుంటున్నాడు. నటనలోనే కాదు ఆయన మొండి తనాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకున్నాడని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పలుకులులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమాన నటుడు నందమూరి తారకరామారావు గురించి మాట్లాడుతూ.. ఆది సినిమా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాకు డైలాగ్స్ రాస్తున్న సమయంలో మా రెండో అమ్మాయి నాగ సుష్మ ఇది బాలకృష్ణ గారి స్క్రిప్ట్‌లా ఉంది మరి తారక్ చిన్న వాడు కదా అంది. దానికి నేను అది నందమూరి రక్తం.. ఎవరు చెప్పినా ఆ డైలాగ్ పండుతుంది అన్నాను. తారక్ రాయలసీమకు వచ్చి నీళ్లు తాగే సన్నివేశం తీసిన షాట్ చూస్తే వినాయక్ ఎంత బాగా సినిమా తీశాడో తెలుస్తుంది. సినిమా క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తారక్ చెయ్యి అద్దానికి తగిలి దెబ్బ తగిలింది.
అప్పుడు నేను షూటింగ్ ఆపేశారా అని అడిగితే లేదు సర్.. తారక్ చేసేస్తానన్నాడు సార్ అని చెప్పాడు.. అప్పుడు నాకు అన్నగారు గుర్తొచ్చారు. తాతగారి మొండి తనం మనవడికి కూడా వచ్చేసిందనుకున్నాను. ఓసారి అన్నగారు 'సర్దార్ పాపారాయుడు' చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు చివరి సన్నివేశంలో ఆయన చేతికి దెబ్బతగిలింది. అయినా షూటింగ్ ఆపకుండా అలానే కంటిన్యూ చేసారు. అలాగే మనవడు కూడా చేస్తున్నాడని అనుకున్నా. ఇక తారక్ చేసిన 'ఆది' సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.. మా అమ్మాయితో ఆ రోజు నేను అన్నమాట రామారావు గారి రక్తం ఎవరికైనా ఒకటే అనేది నిజమైందని ఆరోజే తెలిసింది.
ప్రెస్ మీట్‌లో తారక్ నన్ను పక్కకు పిలిచి మిమ్మల్ని పెదనాన్న అని పిలవొచ్చా అని అడిగారు. తప్పకుండా పిలువు అని చెప్పా.. అప్పటి నుంచి ఇప్పటికీ నన్ను పెదనాన్నగానే గౌరవం ఇస్తాడు అని పరుచూరి అన్నగారి కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గురించి గొప్పగా చెప్పారు. అయితే సినిమాలో తారక్‌కి బాబాయ్ క్యారెక్టర్ నేను చేసుంటే బావుండేది అని ఎప్పటికీ అనిపిస్తుంటుంది. అన్నగారు కూడా సంతోషించేవారు అని పరుచూరి గోపాలకృష్ణ తన అంతరంగాన్ని చెప్పుకొచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com