పావలా శ్యామల కష్టాలు.. వైరల్ వీడియో
ఫిలిం ఇండస్ట్రీలో అంతా అనుకున్నంత ఈజీకాదు. ఎంతో మంది అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. వారి జీవితాల్లో కష్టాలు తప్పవు. ఆర్థికంగా చితికిపోతూ, బతుకీడుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటూనే దీనస్థితిలో జీవిస్తోంది సీనియర్ నటి పావలా శ్యామల. చిరంజీవి దగ్గర నుంచి మెుదలుపెట్టుకుంటే.. నాని, గోపీచంద్ లతో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆర్థికంగా మాత్రం చితికిపోయింది. దీంతో అనాథాశ్రమంలో కాలం వెళ్లదీస్తోంది.
ఓ డిజిటల్ షోలో పాల్గొన్న పావలా శ్యామల తన కష్టాలను వివరించింది. దీంతో.. ఈ వీడియో ఇండస్ట్రీలోని కష్టాలకు మారుపేరంటూ వైరల్ అవుతోంది. పావలా శ్యామల.. స్టేజీపై నాటకాలు వేసే స్థాయి నుంచి వెండితెరపైకి దూసుకొచ్చిన నటి. శ్యామల దీనస్థితి గురించి తెలుసుకున్న నటుడు కాదంబరి కిరణ్ మనం ఫౌండేషన్ ద్వారా రూ. 25 వేలు సాయం చేశారు. ప్రస్తుతం వీల్ ఛైర్ కే పరిమితం అయిన ఆమె.. తాజాగా ఓ షోకు వచ్చారు.
పావలా శ్యామల చెప్పిన మాటలు ఇండస్ట్రీనే నమ్ముకుని వచ్చిన చాలామందికి కంటనీరు తెప్పిస్తోంది. 'సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలతో కలిసి నటించాను. నాటక రంగంలో రెండు వేల సార్లు ఉత్తమ నటిగా అవార్డులను అందుకున్నాను. 50 సార్లు నాకు సన్మానం చేశారు. నాటకాలు తగ్గిపోవడంతో ఆస్తులు అమ్ముకుని ఇక్కడి వచ్చాను. కానీ చివరికి నా బ్రతుకు ఇలా అవుతుందనుకోలేదు. నా కష్టాలు చెప్పుకుని మిమ్మల్ని బాధపెట్టాలని ఇక్కడికి రాలేదు. నేను బ్రతికుండి మళ్లీ మిమ్మల్ని చూస్తానో, లేదో? అనే భయంతో మీ అందరికి ఒకసారి కనిపించి వెళ్దామని వచ్చాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు శ్యామల. ఏడుస్తూనే మాట్లాడారు. ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదని.. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కినా దాన్ని నిలబెట్టుకునేందుకు కూడా కష్టపడాలని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com