Rajasekhar: 'శేఖర్' సినిమాపై స్టే.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన హీరో..

Rajasekhar: సినిమా కథ రాసుకున్నప్పటి నుండి అది ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయ్యేవరకు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలా షూటింగ్ పూర్తి చేసుకొని పలు కారణాల వల్ల విడుదల అవ్వలేని సినిమాలు ఎన్నో. తాజాగా రాజశేఖర్ నటించిన 'శేఖర్' సినిమాకు కూడా అదే సమస్య వచ్చింది. ఈ విషయాన్ని ప్రేక్షకులకు చెప్తూ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు రాజశేఖర్.
సీనియర్ హీరో రాజశేఖర్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా.. మళ్లీ 'గరుడ వేగ' చిత్రంతో ఫామ్‌లోకి వచ్చాడు. అప్పటినుండి కంటెంట్ ఉన్న చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అయితే మే 20 నుండి శేఖర్ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్న రాజశేఖర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా ఫైనాన్షియర్ తనకు రాజశేఖర్ డబ్బులు ఇవ్వాలని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఈ మూవీ స్క్రీనింగ్‌కు స్టే ఇచ్చింది.
శేఖర్ సినిమా నిలిపివేతపై హీరో రాజశేఖర్ స్పందించాడు. 'నాకు, నా కుటుంబానికి శేఖర్ సినిమానే అన్నీ. ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాం. శేఖర్‌కు మంచి స్పందన లభిస్తోంది కానీ ఈరోజు కొందరు మోసం చేసి మూవీ స్క్రీనింగ్‌ను నిలిపివేశారు. సినిమానే మా జీవితం. ముఖ్యంగా ఈ సినిమా మా ఆశ. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు.' అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు రాజశేఖర్.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com