ఆమె 'అరుంధతి'ని రిజెక్ట్ చేయడం 'అనుష్క' అదృష్టం

ఆమె అరుంధతిని రిజెక్ట్ చేయడం అనుష్క అదృష్టం

కొన్ని పాత్రలు కొందరికోసమే సృష్టిస్తారు దర్శకులు.. ఎవరినో అనుకుని ఎవరి దగ్గరకో వెళ్లినా మళ్లీ ఆ పాత్రకు ఎవరైతే సరిగ్గా సరిపోతారో వాళ్లనే వెతుక్కుంటూ వస్తుంది.. ఆ పాత్రలో వాళ్లు నటించరు.. జీవిస్తారు.. అందుకే ఆ పాత్రల తాలూకు నటుల్ని పది కాలాల పాటు గుర్తు పెట్టుకుంటారు ప్రేక్షకులు. అందాలు ఆరబోసే నటుల్ని థియేటర్ వరకే పరిమితం చేస్తారు, బయటకు రాగానే మరిచిపోతారు ప్రేక్షకులు.

అనుష్క అంటే అరుంధతి, అరుంధతి అంటే అనుష్క, ఆ తరువాతే మరే సినిమా అయినా.. అంతగా తెలుగువారి మనసుల్లో చెరగని ముద్ర వేసింది.. మరిచిపోలేకుండా చేసింది. అనుష్క 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న శుభ సందర్భంలో అరుంధతి గురించి నాలుగు మాటలు మాట్లాడుకోని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. కోడిరామ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి 2009లో సంక్రాంతి కానుకగా విడుదలైన లేడి ఓరియంటెడ్ సినిమా.. ఓ ప్రభంజనాన్నే సృష్టించింది అప్పట్లో.

ఆ చిత్రం అంతగా విజయం సాధించడానికి దర్శకుడి పని తీరు, గ్రాఫిక్స్‌తో పాటు ముఖ్యంగా అనుష్క అభినయం ఇప్పటికీ అరుంధతి చిత్రం గురించి మాట్లాకునేలా చేస్తున్నాయి. అప్పటి వరకు అనుష్క పోషించిన పాత్రలను చూసిన ప్రేక్షకులు ఆమెలోని నట విశ్వరూపాన్ని అరుంధతిలో మొదటి సారి చూశారు. ఆమె నటనకు ముగ్ధులైన ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు, ఇండస్ట్రీలోని పెద్దలు సైతం తెలుగు తెరకు మరో మంచి నటి దొరికిందని సంబరపడ్డారు.

అనుష్కకు ఇంతటి అదృష్టాన్ని, గౌరవాన్ని కల్పించింది పరోక్షంగా మరో హీరోయిన్.. ఆమే జూనియర్ ఎన్టీఆర్‌ 'యమదొంగ' చిత్రంలో స్టెప్పులేసిన మమతా మోహన్‌దాస్. చిత్ర బృదం అరుంధతి కథను సిద్ధం చేసుకుని నటీ నటుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో వారు ఆ పాత్ర కోసం మమతను సంప్రదించారట.. అయితే అప్పటికే ఆమె ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో పాటు అరుంధతి పాత్రను పోషించేందుకు సుముఖత వ్యక్తం చేసిందట.

ఇలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువ రోజులు డేట్లు ఇవ్వాల్సి ఉంటుందని, ఈ గ్యాప్‌లో రెండు, మూడు చిత్రాలు చేసుకోవచ్చని ఎవరో ఆమెకు చెప్పడం వంటి పలు కారణాలతో మమత.. అరుంధతి పాత్రకు నో చెప్పింది. దీంతో మరో పొడవాటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అని ఆరా తీయగా అనుష్క కనిపించింది చిత్ర యూనిట్‌కి. కథ వినగానే అనుష్క ఓకే చెప్పడం, వెంటనే షూటింగ్ మొదలు పెట్టి సమయానికి పూర్తి చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

రిలీజ్ సమయంలో ఫైనాన్షియర్లు ఇబ్బంది పెట్టినా అన్ని అడ్డంకులను అధిగమించి అరుంథతి ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. అలా మమతా మోహన్ దాస్ తిరస్కరించిన అరుంధతి పాత్రను అనుష్క పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితోనే ఆమెను మరిన్ని మంచి పాత్రలు వరించాయి.

Next Story