సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణానికి కారణం అదేనా?

బాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా మృతి చెందిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ళకే యువనటుడి ఆకస్మిక మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. సిద్ధార్థ్ శుక్లా ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ధార్థ్ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఆయన చనిపోయే ముందురోజు కూడా ఆయన వర్కవుట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. రాత్రి 8గంటల సమయంలో ఇంటికి చేరుకున్న సిద్ధార్థ్.. పది గంటల సమయంలో జాగింగ్‌తో పాటు కొన్ని వర్కవుట్స్ చేశాడని తెలుస్తుంది.
ఆ తర్వాత కొన్ని మెడిసిన్స్ వేసుకొని పడుకున్నారని, తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఛాతీలో నొప్పిరావడంతో తన తల్లికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె స్వయంగా నీళ్లు తాగించింది. అనంతరం నిద్రపోయిన సిద్ధార్థ్ మళ్లీ మేల్కొనలేదు. ఈ క్రమంలో సిద్ధార్థ్ శుక్లా తల్లి తన కూతురుకి ఫోన్ చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సిద్ధార్థ్ శుక్లా మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు సిద్ధార్థ్.. దాదాపు 3గంటల పాటు వ్యాయామం చేసేవారట. అయితే వర్కవుట్ సమయాన్ని కాస్త కుదించమని ఇటీవలె వైద్యులు సలహా ఇచ్చినట్లు సమాచారం. తీవ్రమైన వర్కవుట్స్ కూడా ప్రమాదమేనని వైద్యులు అంటున్నారు. తాజాగా ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం కూడా పూర్తయింది. ఆయన మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, గుండెపోటుతోనే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
1980 డిసెంబర్12న ముంబైలో జన్మించిన శుక్లా 'హంప్టీ శర్మ కి దుల్హనియా' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 13లో విన్నర్ గా గెలిచి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com