ఎస్పీబి ఆరోగ్యం మెరుగవుతోంది..

ఎస్పీబి ఆరోగ్యం మెరుగవుతోంది..
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీబి ఆరోగ్యం మెరుగవుతోంది.. కుదుట పడుతోంది..

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుట పడుతోంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందజేస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా తగ్గిందని.. కొద్దిరోజులుగా ఆయనకు అందిస్తున్న ఫిజియో థెరఫీ చికిత్స కూడా మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు బాలు. ఆ రోజు నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ తరవాత ఎక్మో సపోర్ట్‌తో కూడా చికిత్స చేస్తున్నారు. అయితే.. ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తనయుడు చరణ్ కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు. నాన్న ఆరోగ్యం మెరుగవుతోందని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

ఇప్పటికీ బాలు ఐసియులో వెంటిలేటర్‌పైనే ఉన్నా మనుషులను గుర్తు పడుతున్నారని చెప్పారు వైద్యులు. ప్రత్యేక వైద్య బృందాలు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఆయనకు చికిత్స చేస్తున్న బృందంలో విదేశీ వైద్యులు కూడా ఉన్నారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story