24 Feb 2021 9:01 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / HBD Nani :నేచురల్...

HBD Nani :నేచురల్ స్టార్ నాని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

నాని పుట్టింది కృష్ణాజిల్లా చల్లపల్లి. కానీ చిన్నతనంలోనే ఆయన పేరెంట్స్ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అలా హైదరాబాద్ కుర్రాడయిన నాని కాలేజ్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.

HBD Nani :నేచురల్ స్టార్ నాని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
X

ఊహించని అవకాశం.. ఇది చాలా తక్కువ మందికి వర్తించే మాట. ఆ అవకాశాన్ని అందుకుని అందలాలు ఎక్కడం కూడా కొందరే చేస్తారు. అలా అనుకోకుండా వచ్చిన హీరో ఛాన్స్ ను నిలబెట్టుకుని స్వయంకృషితో స్టార్ హీరోగా మారాడు నాని. చాలా తక్కువ టైమ్ లోనే తనదైన ఇమేజ్ ను, మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. మరోవైపు సహజ నటనతో ఆకట్టుకుని నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీదున్న ఈ టక్ జగదీష్ బర్త్ డే ఇవాళ.

నాని పుట్టింది కృష్ణాజిల్లా చల్లపల్లి. కానీ చిన్నతనంలోనే ఆయన పేరెంట్స్ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అలా హైదరాబాద్ కుర్రాడయిన నాని కాలేజ్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా బాపు, శ్రీను వైట్ల వద్ద పనిచేశాడు. రేడియో జాకీగానూ మెప్పించాడు. మోడలింగ్ చేస్తోన్న టైమ్ లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కంట్లో పడ్డాడు. ఇంద్రగంటి తన అష్టాచెమ్మా సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. నానికి ఇది ఊహించని అవకాశం. అయితేనేం.. తనదైన టాలెంట్ తో ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేశాడు.

నాని హీరోగా వచ్చిన టమ్ లో వారస హీరోల హవా ఉంది. కొత్తగా వస్తోన్న వాళ్లంతా వారసులే. అయినా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించాడు. రైడ్, స్నేహితుడా సినిమాలతో మరింతగా ఆకట్టుకున్నాడు. అలాగే ఓ తమిళ్ సినిమాను రీమేక్ చేశాడు. భీమిలీ కబడ్డి జట్టు అనే ఈ మూవీతో నటుడుగా బాగా మెప్పించాడు. కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా నానికి మంచి పేరు తెచ్చింది.

ఏ ఆర్టిస్ట్ కైనా ఆఫర్స్ రావడం కంటే వాటి నుంచి బ్రేక్ రావడం ఇంపార్టెంట్. అది ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంది. ఈ విషయంలోనూ నాని అదృష్టవంతుడు అనే చెప్పాలి. కెరీర్ మొదలుపెట్టిన రెండేళ్లలోనే తిరుగులేని బ్రేక్ వచ్చింది. అదే అలా మొదలైంది సినిమా. నందినీ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అయిన ఈ సినిమా నాని కెరీర్ ను స్ట్రాంగ్ గా నిలబెట్టింది. నానితో పాటు నిత్యమీనన్ నటన, నందినీ టేకింగ్ కథ, కథనం అన్నీ కరెక్ట్ గా కుదరడంతో అలా మొదలైంది సూపర్ హిట్ గా నిలిచింది.

నాని కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ పైకే వెళ్లింది. అలా మొదలైంది తర్వాత పిల్ల జమిందార్ తో మరో సూపర్ హిట్ పడింది. అప్పటికే నేచురల్ స్టార్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఇండస్ట్రీ సైతం నానికి ఫ్యాన్ గా మారింది. అందుకే ఏకంగా రాజమౌళి సినిమాలోనే ఆఫర్ వచ్చింది. ఈగలో పాత్ర చిన్నదే అయినా సినిమా అంతా నాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. అటుపై గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చేసిన ఎటోవెళ్లిపోయింది మనసు నానిలోని సిసలైన నటుడ్ని మరోసారి చూపించింది.

ఒకట్రెండు సినిమాలు పోయిన తర్వాత వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం నాని కెరీర్ లో మరో బెస్ట్ మూవీ. విజయ్ దేవరకొండకు నటుడుగా గుర్తింపు తెచ్చింది కూడా ఈ చిత్రమే. కేవలం డబ్బు ఆశను మాత్రమే కలిగి ఉన్న యంగ్ బిజినెస్ మేన్ గా నాని నటన ప్రశంసలు వచ్చాయి. చివర్లో లైఫ్ అంటే డబ్బు కాదు అని తెలుసుకోవడంతో ఈ సినిమా ముగుస్తుంది. చాలామందికి ఈ సినిమా ఓ పాఠంగా మారింది.

భలేభలే మగాడివోయ్.. నాని ఆల్ టైమ్ హిట్ మూవీస్ లో ఉండే సినిమా. మతిమరపు ఉన్న కుర్రాడిగా అదరగొట్టాడు. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మన్ అంటూ వరుస హిట్స్ తో దూసుకుపోయాడు. ఒక్కో సినిమాతో ఒక్కో వైవిధ్యం చూపించాడు. మజ్ను పోయినా మళ్లీ నేను లోకల్, నిన్నుకోరి, మిడిల్ క్లాస్ అబ్బాయ్ అంటూ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. అయితే వరుస విజయాలు చూసి కన్నుకుట్టిందేమో.. తర్వాత కొన్ని ఫ్లాపులు చూశారు.

ఏ స్టార్ అయినా తన ఇమేజ్ ను బ్రేక్ చేసే సినిమాలు అప్పుడప్పుడూ చేయాలి. లేదంటే మొనాటనీ వస్తుంది. అందుకే ఓ రెండు మూడు సినిమాలు పోయిన తర్వాత నాని జెర్సీ తో ఆ వైవిధ్యంతో పాటు అత్యుత్తమ నటన చూపించాడు. ఇలాంటి కథ ఎంచుకున్నందుకు నానికి ఫిదా అయ్యారు ఆడియన్స్. అయితే తర్వాత చేసిన నానీస్ గ్యాంగ్ లీడర్, వి సినిమాలు పోయాయి. అందుకే ఇప్పుడు మళ్లీ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.

నటుడుగానే కాదు.. నిర్మాతగానూ మెప్పించాడు. అఁ, హిట్ మూవీస్ తో మెప్పించాడు. ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ మూవీస్ చేస్తున్నాడు నాని. తన బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టక్ జగదీష్ టీజర్ కు టాలీవుడ్ అంతా సర్ ప్రైజ్ అవుతోంది. నానిలోని మాస్ యాంగిల్ ను క్లాస్ గా పరిచయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా నానిలాగా కెరీర్ ను ప్లాన్ చేసుకునే యంగ్ హీరోలు లేరనేది నిజం. నేచురల్ స్టార్ గా ఆల్ క్లాస్ ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్న నాని మరిన్ని మంచి సినిమాలు, విజయాలతో ఆకట్టుకోవాలని కోరుకుంటూ ఈ శ్యామ్ సింగరాయ్ కి బర్త్ డే విషెస చెబుతోంది టివి5.

Next Story