బాలూ జీవితంలో తీరని ఒకే ఒక కోరిక ఇదే!

బాలు గొంతు తేనె కంటే తియ్యగా ఉంటుంది.. అందుకేనేమో ఎస్పీ పాట వింటే వెంట్రుకలు కూడా నిక్కబొడుచుకుంటాయి.. ఆయన పాట అంతగా పరవశింపజేస్తుంది. సంగీత ప్రపంచంలో పాటల రారాజు అస్తమించడం అందరిని కలచివేసింది. ఈ క్రమంలో బాలుతో ఉన్న తమ అనుబంధాన్ని.. జ్ఞాపకాలని.. అనుభవాలని.. పలువురు ప్రముఖులు గుర్తు చేసుకుంటూన్నారు. ప్రముఖ కథారచయిత శ్రీరంగం శ్రీరమణ కూడా బాలు గురించి ఓ ఆసక్తికర అంశం వెల్లడించారు. బాలు తన జీవితంలో కోటానుకోట్లు కోరికలు తీర్చుకున్నా.. తీరని కోరిక ఒకటి ఉండిపోయిందని తెలిపారు.
నవంబర్ నెలలో వచ్చే శరద్ రుతువులో గోదావరి నదిపై పున్నమి వెన్నెల్లో బోటు విహారం చేయాలనుకున్నారట బాలు. పాపికొండల నుంచి గోదావరిలో శబరి నది కలిసే వరకు మూడు లాంచీలు, ఆరు పంట్లు (పంట్ అంటే లాంచీకి టగ్ చేసే ఫ్లాట్‌ఫాం) కట్టుకుని వాటిపై పాటలు పాడుకుంటూ ప్రయాణం చేయాలని బాలు కోరుకునేవాడని శ్రీరమణ వెల్లడించారు. ఆ బోటు ప్రయాణంలో తనతో పాటు బాపు-రమణ, వేటూరి, ఏఆర్ రహమాన్, డ్రమ్స్ శివమణి, ఫ్లూట్ ఆర్టిస్ట్ గుణ ఉండాలని అనుకునేవాడు. వేటూరి అప్పటికప్పుడు పాటలు రాస్తే వాటిని ఆలపించాలనేది బాలు కోరిక. కానీ అది తీరకుండానే అభిమానులకు తరగని విషాదాన్ని మిగుల్చుతూ అనంతవాయువుల్లో ఐక్యమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com