ఈ అతిరథ మహారథుల్ని ఒకేరోజు కన్న సినీ కళామాతల్లి!

తెలుగు సినిమా.... అతిరథ మహారథుల్ని కన్న కళామాతల్లి. ఆ బిడ్డల పుట్టినరోజులు.. సినీ ప్రేమికులకు పండగ రోజులు. అలాంటి మూడు పండుగలు ఒకే రోజు కలిసొస్తే... ఓ ముగ్గురు సినీ దిగ్గజాలు ఒకే రోజు పుడితే.. అది నిజంగానే సినీ అభిమానులకు సంక్రాంతి అవుతుంది. ఆ ముగ్గురు ఎవరో కాదు.. అందం అభినయం పోత పోసినట్టుండే దిగ్రేట్ స్టార్ శోభన్‌బాబు. విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన నట విరాట్ రావు గోపాలరావు. హాస్యం చిత్రంలో ఓ భాగంగా కాకుండా.. హాస్యమే ప్రధాన రసంగా చిత్రాలు నిర్మించిన హాస్యబ్రహ్మ జంధ్యాల. ఆ ముగ్గురూ.. ఎవరికి వారే సాటి. పోటీ లేని మేటి. ఆ ముగ్గురి పుట్టినరోజులు జనవరి 14 రోజునే కావడం విశేషం.
వెండితెరపై నిండైన రూపం. అందానికి పర్యాయపదం... శోభన్‌బాబు. ప్రతిభను నమ్ముకుని సినీ రంగంలోకి ప్రవేశించిన ఉప్పు శోభనాచలపతి... అంచెలంచెలుగా ఎదిగి... సూపర్‌స్టార్ శోభన్‌బాబుగా ఎదిగారు. 1959లో భక్త శబరి చిత్రం ద్వారా శోభన్‌బాబుకు తొలి అవకాశం లభించింది. కానీ.. అదే ఏడాది దైవబలం చిత్రం ముందుగా విడుదలైంది. శ్రీ సీతారామ కల్యాణం, భీష్మ, మహామంత్రి తిమ్మరసు, ఇరుగు పొరుగు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1963లో విడుదలైన లవకుశ, నర్తనశాల చిత్రాలతో ఇండస్ట్రీలో పెద్దల దృష్టిలో పడ్డాడు.
శోభన్‌బాబు పౌరాణిక పాత్రలు పోషిస్తూనే... సాంఘిక చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇరుగు పొరుగు, సుమంగళి, గూడఛారి 116 వంటి సినిమాల్ని మైలురాళ్లుగా మలచుకున్నాడు. చిన్న పాత్ర అయినా... ప్రధాన పాత్ర అయినా... ఎలాంటి తేడా లేకుండా నూటికి నూరుపాళ్లు శ్రద్ధ పెట్టి సినిమా చేయడం శోభన్‌బాబును క్రమశిక్షణ కలిగిన నటుడిగా నిలిపాయి. మంచిపాత్ర అనుకుంటే... చిన్నచిన్న వేషాలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. చిన్నచిన్న పాత్రలతోనే.... తన కెరీర్‌కు బాటలు వేసుకున్నారు.
కుటుంబ కథాచిత్రాల హీరోగా శోభన్ బాబు ప్రత్యేకత చాటుకున్నాడు. భార్య, కలసిన మనసులు, చుట్టరికాలు, జీవిత బంధం, కుంకుమ భరిణె వంటి సినిమాలు శోభన్‌బాబును మగువల మనసు దోచిన అందాల నటుడిగా నిలిపాయి. సతీ అనసూయ, రామాలయం, చెల్లెలి కాపురం చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక... 1972లో బాపు దర్శకత్వంలో విడుదలైన సంపూర్ణ రామాయణం... శోభన్‌బాబు స్టార్ ఇమేజీని పెంచింది. అప్పటివరకు రాముడంటే ఎన్‌టీఆర్ గుర్తుకువచ్చేవారు. సంపూర్ణ రామాయణంతో... శోభన్‌బాబు కూడా ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. జీవనజ్యోతి, బలిపీఠం, సోగ్గాడు, కురుక్షేత్రం, వీరాభిమన్యు, నిండు మనిషి, కార్తీక దీపం, దేవత స్వయం వరం, ముందడుగు వంటి చిత్రాలు శోభన్‌బాబుకు ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ హిట్‌లు ఇచ్చాడు. ఏవండి ఆవిడ వచ్చింది, బలరామకృష్ణులు వంటి చిత్రాలతో అభిమానుల్ని అలరించారు. 1996లో హలో గురూ... శోభన్ బాబు చివరి చిత్రం. 230 చిత్రాల్లో నటించి... స్వచ్ఛందంగా విరామం తీసుకున్న శోభన్‌బాబు... 2008 మార్చి 20 హఠాన్మరం చెందారు.
వెండతెర విలనిజానికి.... కేరాఫ్ అడ్రస్‌గా దశాబ్దాల పాటు తన నవరస నటనతో ప్రేక్షక లోకాన్ని అలరించిన నటవిరాట్... రావు గోపాలరావు. రౌద్రమైనా, హాస్యమైన అలవోకగా పలికించిన ప్రతిభాశాలి... రావుగోపాలరావు. నాటకరంగంలో విశేష గుర్తింపు పొందిన రావుగోపాలరావు.... 1966లో భక్తపోతన చిత్రంలో సినీరంగంలోకి ప్రవేశరించారు. జగత్ కిలాడీలు చిత్రంతో మెయిన్ విలన్‌గా నటించారు. అనంతరం కేఎస్‌ఆర్ దాస్ తెరకెక్కించిన గండర గండడు, బాపు కావ్యం ముత్యాల ముగ్గు చిత్రాలు.... రావుగోపాల రావును ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
బాపు అభిమాన నటుడు రావు గోపాలరావు. అందుకే ఆయనకు తన చిత్రాల్లో ఎన్నో మేటి పాత్రలు ఇచ్చారు. భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు చిత్రాలు నటవిరాట్ విశ్వరూపాన్ని ఆవిష్కరించాయి. మా ఊళ్లో మహా శివుడు చిత్రంలో శివుడి పాత్రలో నటించి మెప్పించారు. ఏ పాత్ర పోషించినా.... రొటీన్ అనే భావన కలగకుండా ఎప్పటికప్పుడు తన నటనలో, సంభాషణలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. విలన్ పాత్రలు వరుసగా చేసినా... ఏ చిత్రానికి ఆ చిత్రం... వెరైటీ శైలి ఉండేలా చూసుకునేవారు. విలన్‌గా కూడా హాస్యాన్ని పలికిస్తూ.... నవరసాలు ఒలికిస్తూ... 125 చిత్రాలతో... తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.
నిర్మాతగానూ రావుగోపాలరావు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. స్టేషన్ మాస్టర్, లారీ డ్రైవర్, భార్గవ రాముడు, వింత దొంగలు వంటి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు పొందారు. 1993లో ఆ ఒక్కటీ అడక్కు, అల్లరి ప్రియుడు, అల్లరి అల్లుడు, ప్రేమ అండ్ కో సినిమాల్లో నటించాడు. ప్రేమ అండ్ కో... రావు గోపాలరావు చివరి చిత్రం. తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రల్లో కనిపించిన రావుగోపాలరావు.... నిజ జీవితంలో చాలా సౌమ్యుడు. ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన రావుగోపాలరావు నట వారసునిగా రావు రమేశ్... ఈ తరం ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
హస్యం అంటే సినిమాలో ఓ ట్రాక్ అనే ధోరణి నుంచి... సినిమా ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగే చిత్రాలు తీయడం ద్వారా... తెలుగు చలన చిత్ర చరిత్రలో హస్య బ్రహ్మగా నిలిచిపోయారు. విద్యార్థి దశ నుంచే నాటకాలు రాసిన జంధ్యాల..... రచయితగా సినిమాల్లోకి వచ్చారు. 1976లో దేవుడు చేసిన బొమ్మలు చిత్రం ద్వారా మాటల రచయితగా సినిమా జీవితం ప్రారంభించిన జంధ్యాల ఐదేళ్లలో 85 చిత్రాలకు రచయితగా పనిచేసిన ఘనత వహించారు. అందులో 80 శాతం ఘన విజయం సాధించడంతో రచయితగా మంచి గుర్తింపు పొందారు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలకు జంధ్యాల మాటల రచయిత.
ముద్ద మందారం సినిమాతో దర్శకుడిగా మారిన జంధ్యాల.... నాలుగు స్తంభాలాట, రెండు జెళ్ల సీత, మూడు ముళ్లు చిత్రంతో ప్రత్యేకతను చాటారు. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోని నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకుల్ని మైమరపింపచేశాడు. ఆనంద భైరవి చిత్రంతో తనలోని కళాత్మక కోణాన్ని ఆవిష్కరించాడు. పుత్తడి బొమ్మ వంటి సామాజిక ఇతివృత్తాన్ని చర్చించాడు. సీతారామ కల్యాణం, చంటబ్బాయి, పడమటి సంధ్యారాగం, అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాలతో దర్శకుడిగానూ జంధ్యాల విజయవంతమయ్యారు.
జంధ్యాల హస్యరసంతో పాటు కరుణ రసాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. కథా ఇతివృత్తానికి అనుగుణంగా తనలోని సామాజిక కోణాన్ని అక్షరాలుగా మలచి ఆవిష్కరించారు. నెలవంక, పుత్తడి బొమ్మ, చంటబ్బాయి, బాబాయి హోటల్ వంటి చిత్రాలు.... గుండెల్ని పిండేసే సంభాషణలు రాయగల జంధ్యాల కలాన్ని మనకు పరిచయం చేస్తాయి. నిజజీవితంలోనూ నవ్వుతూ నవ్విస్తూ... ఉండే జంధ్యాల... ఎంతో మందిని తెలుగు తెరకు పరిచయం చేశారు. తన 50వ ఏట చిన్న వయసులోనే... గుండెపోటుతో కన్ను మూశారు. భౌతికంగా తను దూరమైనా... మంచి హాస్యాన్ని అందించి... మనందరి మధ్యే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com