Tollywood: బాక్సాఫీస్ రిపోర్ట్: సీనియర్ హీరోల శివతాండవం..

Tollywood: బాక్సాఫీస్ రిపోర్ట్: సీనియర్ హీరోల శివతాండవం..
సంక్రాంతి బరిలో బాలయ్య- వీరయ్యలదే హవా; బాక్సాఫీస్ ను షేక్ చేసిన సీనియర్ హీరోలు


నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్నవాళ్లు ఇన్నేళ్ల తర్వాత కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఎంటైర్ ట్రేడ్ ను ఆశ్చర్యపరుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంక్రాంతి బరిలో నిలిచి సత్తా చాటుతుండటం విశేషం అనే చెప్పాలి. వీరిద్దరూ యంగ్ స్టర్స్ గా ఉన్నప్పటి నుంచీ ఎన్నోసార్లు బాక్సాఫీస్ వార్ లో తలపడ్డారు. చివరగా ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణితో మరోసారి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చిన ఆరేళ్లకు మరోసారి ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచి సత్తా చాటి కమర్షియల్ గా కెరీర్ బెస్ట్ హిట్స్ అందుకుంటుండటం పరిశ్రమలోనూ ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

నిజానికి వీరి తరంతో పోలిస్తే ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ లో మార్పులు వచ్చాయి. టెక్నికల్ గా, కథల పరంగా సినిమాలు మారాయి. బట్ ఈ ఇద్దరూ చేసిన రెండు సినిమాల్లో కథల్లో కానీ, టెక్నికల్ గా కానీ ఏ మాత్రం కొత్తదనం లేదు. ఈ తరహా కథలు వీళ్లే ఇప్పటికే ఎన్నోసార్లు చేసి ఉన్నారు. ఓ రకంగా ఇది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ తరహా మేటర్. అయితే బాటిల్ కొత్తదైనా వైన్ కిక్ ఇస్తుంది కదా అన్నట్టుగా ఈ మాస్ హీరోలిద్దరూ మాస్ ఆడియన్స్ తో పాటు తమ ఫ్యాన్స్ పై నమ్మకంతో చేసిన ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ ను ఊపేస్తున్నాయిప్పుడు. వీరి వయసును బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా ఆశ్చర్యమే అని చెప్పాలి. 60యేళ్లు దాటిన తర్వాత వారు వేసిన స్టెప్పులు, చేసిన ఫైట్స్ కు మాస్ తో పాటు క్లాస్ నుంచి క్లాప్స్ పడుతున్నాయంటే ఆ హీరోలపై ఆడియన్స్ లో ఇంకా ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

తొలి నాలుగు రోజుల్లోనే బాలయ్య మూవీ 104 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే.. తొలి మూడు రోజులకే మెగాస్టార్ మూవీ 108 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక.. ఓవర్సీస్ లో వీరసింహారెడ్డి ఒన్ మిలియన్ మార్క్ ను టచ్ చేయగా.. వాల్తేరు వీరయ్య 1.7 మిలియన్ల మార్క్ ను క్రాస్ చేసింది. మొత్తంగా సీనియర్ హీరోల శివతాండవానికి బాక్సాఫీస్ షేక్ అవుతుంటే.. టాలీవుడ్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. మరి ఈ ఊపును సమ్మర్ వరకూ కంటిన్యూ చేయగలిగితే ఈ 2023 టాలీవుడ్ కు మెమరబుల్ గా మారుతుంది.

Y J Rambabu

Entertainment Editor


Tags

Read MoreRead Less
Next Story