Tollywood: 'డిటెక్టివ్ తీక్షణ' ఫస్ట్ లుక్ విడుదల

విలక్షణ నటుడు ఉపేంద్ర భార్యామణి ప్రియాంకా త్రివేది మరోసారి వెెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. పెళ్లయ్యాక దాదాపు నటనకు దూరమైన ప్రియాంక 50వ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. డిటెక్టివ్ తీక్షణగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రియాంక తెలుగు, తమిళ, కన్నడ, బెంగాళీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. బహుభాషా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో విలక్షణమైన డిటెక్టివ్ గా ఆమె కనిపించబోతున్నారు. బెంగాల్‌లో పుట్టిన ప్రియాంక త్రివేది బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో 90వ చివరి దశకం నుంచి 2000 తొలి నాళ్ళ వరకు అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ప్రముఖ కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్రను పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉన్నా ప్రియాంకకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అయినా నచ్చిన క్యారెక్టర్ లను మాత్రమే ఎంచుకుంటూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇన్నేళ్లగా ఆకట్టుకునే నటనతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'డిటెక్టివ్ తీక్షణ' గా తన 50వ చిత్రంతో మన ముందుకు రానున్నారు. ఈ మేరకు ఆ సినిమా నుంచి ఆకట్టుకునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రియాంక గన్ పట్టుకుని టిపికల్ యాక్షన్ పోజ్ తో ఉన్న ఈ ఫస్ట్ లుక్, టైటిల్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహిస్తుండగా పొలకల చిత్తూర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గుత్తముని ప్రసన్న, జి ముని వెంకట్ చరణ్ ( ఈవెంట్ లింక్స్, బెంగళూర్) పురుషోత్తం బి (ఎస్ డి సి) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com