మెస్సీపై మొక్కవోని ప్రేమ : కేరళ నుంచి స్పెయిన్ దాకా పయనం.. తీరా అక్కడికి వెళ్లాక..!

స్పెయిన్
మెస్సీపై మొక్కవోని ప్రేమ : కేరళ నుంచి స్పెయిన్ దాకా పయనం.. తీరా అక్కడికి వెళ్లాక..!
టీనేజ్ లోనే మెస్సీ ప్రేమలో పడ్డ కేరళకుట్టి, అతనికోసమే స్పెయిన్ నేర్చుకుంది, స్పెయిన్ ఫ్లైట్ ఎక్కింది. త్వరలోనే అతడిని కలిసేందుకు సన్నద్ధం అవుతోంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని సాకర్ ఫీవర్ ఊపేస్తోంది. ఫిఫా వరల్డ్ కప్ ను ఏ దేశం చేజిక్కించుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడబోతోంది. ఆ తరువాత అందరూ మళ్లీ సాధారణ జీవితంలో యథావిధిగా ట్యూన్ అయిపోతారు. కానీ, కేరళకు చెందిన జష్నా షాహిన్ కు మాత్రం 365రోజులూ ఇదే ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే ఆమెకు ఫుట్ బాల్ అంటే ఆట కాదు ఎమోషన్. దానికి కారణం అర్జెంటీనా ఆటగాడు మెస్సీ. ఈ ఎమోషన్ ఎంత స్ట్రాంగ్ అంటే ఆమెను కేరళ నుంచి అమాంతం స్పెయిన్ దాకా లాక్కెళ్లిపోయంది.


కేరళలోని కానుర్ జిల్లాకు చెందిన షాహిన్ 15ఏళ్ల ప్రాయంలో టీవీ స్క్రీన్ పై తొలిసారి మెస్సీని చూసి అమాంతం అతడి మైకంలో పడిపోయింది. ఈ ప్రేమను టీనేజ్ క్రష్ గా భావించి ఆమె తల్లిదండ్రులు కొట్టిపారేసినప్పటికీ షాహిన్ మాత్రం లోలోపలే మెస్సీ పట్ల విపరీతమైన ఆరాధనను పెంచుకుంది. 2010 వరల్డ్ కప్ మొదలు ఆమె ఆశలు, ఆశయాలు అన్నీ మెస్సీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆఖరికి స్పానిష్ భాష నేర్చుకుని స్పెయిన్ వెళ్లేవరకూ ఆమె నిద్రపోలేదంటే అతిశయోక్తి లేదు.



ఈ క్రమంలో పై చదువులు పూర్తి చేసుకుని, పెళ్లి చేసుకుని, ఓ చిన్నారికి తల్లి అయిన షాహిన్ మెస్సీని కలిసేందుకు విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది. అతడిని చేరుకునేందుకు ఒక్కో మెట్టూ పైకి ఎక్కుతోంది. పెళ్లికి ముందు మెస్సీకి చేరువగా బార్సిలోనాకు వెళ్లాలని భావించింది షాహిన్. కానీ, ఆ ముచ్చట తీరకుండానే 2019లో ఆమెకు పెళ్లైపోయింది.


అయితే తన మనసులోని మాటను భర్తకు తెలుపగా, అతని ప్రోత్సాహంతోనే ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా స్పెయిన్ లో అడుపెట్టింది. అనంతరం భర్త కూడా ఆమెకు తోడుగా అక్కడికి చేరుకున్నాడు. క్రమంగా మెస్సీని కలిసేందుకు ఒక్కో ప్రయత్నం మొదలుపెట్టిన షాహిన్ కు పలు ధరఖాస్తుల తరువాత మెస్సీ మ్యాచ్ ను కవర్ చేసేందుకు అనుమతి లభించింది.


సరిగ్గా అదే సమయానికి ప్రసవం నిమిత్తం భారత్ వచ్చిన షాహిన్, ఎలా అయినా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న యోచనతో చంటి బిడ్డతో స్పెయిన్ కు తిరుగుప్రయాణం అయింది. ప్రస్తుతం మెస్సీని ఇంటర్వ్యూ చేయాలన్న తపనతో స్పోర్ట్స్ జర్నలిజంలో మాస్టర్స్ చేస్తోంది. ఇందుకోసం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా తన ఆశయానికి ఏదీ అడ్డురాదని నిరూపిస్తోంది. ఇంకో పదేళ్లైనా మెస్సీని కలిసి అతడి ఇంటర్వ్యూ తీసుకుంటానని చెబుతోంది షాహిన్.

Tags

Next Story