భగవంతుడా..! బతికుండగానే అంత్యక్రియలు చేసుకున్న వృద్ధుడు!

బ్రతికుండగానే ఓ వృద్ధుడు అంత్యక్రియలు చేసుకున్నాడు. ఈ విచిత్రమైన ఘటన తాజాగా ఉత్తరాఖండ్‌లోని రాంపూర్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాంపూర్‌కు చెందిన రూప్‌రామ్ (103)కి నా అంటూ ఎవ్వరూ లేరు. అతని భార్య చాలాకాలం క్రితమే భార్య చనిపోగా.. ఇద్దరు కూతుళ్లు కొంతకాలంగా ఈయన వద్దకు రావడం లేదు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారో కూడా అతనికి తెలియదు.
అయితే రేపు తానూ చనిపోతే అంత్యక్రియలు ఎవరూ చేయరని గుర్తుంచిన ఆ వృద్దుడు.. అక్కడ స్థానిక పూజారిని సంప్రదించాడు. ఆయన పున్నామ నరకం నుంచి తప్పించుకునేందుకు ఎవరైనా తమకు తామే అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పాడు. పూజారి ఇచ్చిన సూచనతో హిందూ సంప్రదాయం ప్రకారం తన అంత్యక్రియలు, కర్మకాండను తానే నిర్వహించుకున్నాడు.
మంత్రోచ్ఛరణలు, బ్యాండ్ మేళం చప్పుళ్లతో ఘనంగా తంతు జరిపించుకున్నాడు. అనంతరం గ్రామస్తులకు రుచికరమైన భోజనాన్ని కూడా పెట్టాడు. అనంతరం రూప్‌రామ్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఇద్దరు బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడే తన భార్య చనిపోయిందని, ఆ తర్వాత తన బిడ్డలు కూడా ఎవరి బతుకును వాళ్లు వెతుక్కుంటూ వెళ్లిపోయారని, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని కంటతడి పెట్టాడు.
ఒంటరైనా తనకి రేపు చనిపోతే అంత్యక్రియలు చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేకపోవడంతో బతికుండగానే తన కర్మకాండలు తానె చేసుకున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా చాలా మందికి ఈ సంఘటన కంటతడి పెట్టిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com