టమాటాలకు సెలబ్రెటీ హోదా... రక్షణగా బౌన్సర్లు

టమాటాలకు సెలబ్రెటీ హోదా... రక్షణగా బౌన్సర్లు
టమాటాల రక్షణ కోసం ఇద్దరు బౌన్సర్ల ఏర్పాటు..... వారాణాసిలోని కూరగాయల వ్యాపారి వినూత్న చర్య.... ఎగబడేవారిని నియంత్రణకే అని వెల్లడి

సాధారణంగా సెలబ్రిటీలు తమ రక్షణ కోసం బౌన్సర్లను పెట్టుకుంటారు. రాజకీయ నేతలు కూడా అపాయం రాకుండా బాడీగార్డులను నియమించుకుంటారు. ఇప్పుడు టమాటాలకు కూడా సెలబ్రిటీ హోదా వచ్చేసింది. అందుకే వాటి కోసం బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. టమాటాల రక్షణ కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ వ్యాపారి బాడీగార్డులను ఏర్పాటు చేసుకున్నాడు.


దేశవ్యాప్తంగా టమాటాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కనీసం రెండొందలైనా లేనిదే.. కూరలోకి రానని టమాట మొండికేస్తోంది. దేశవ్యాప్తంగా కిలో టమాటా రూ.120 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ను బట్టి రూ.250 కూడా ధర పలుకుతోంది. కొందరైతే టమాటా తోటల్లో, టమాటా దుకాణాల్లో వాటిని లూటీ కూడా చేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని ఓ రైతుకి చెందిన పొలంలో రూ.3 లక్షల విలువ చేసే టమాటాలను కూడా దొంగిలించారు. ఈ ఘటనలతో ఓ కూరగాయల వ్యాపారి అప్రమత్తమయ్యాడు. తాను విక్రయించే టమాటాలకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకున్నాడు.

వారణాసిలో అజయ్‌ పౌజీ అనే కూరగాయల వ్యాపా చేసిన ఈ వినూత్న ప్రయోగం సర్వత్రా చర్చనీయాంశమైంది. అజయ్‌ టమాటాలను ఎవరూ చోరీ చేయకుండా బాడీగార్డులను ఏర్పాటు చేసుకున్నాడు. ధర ఎక్కువగా ఉండటంతో కొంతమంది టమాటాలను దొంగతనం చేస్తున్నారని, సరుకు తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారులు ఎగబడుతుంటారని, ఈ క్రమంలో కొన్నిసార్లు కొట్టుకుంటున్నారని వ్యాపారి అజయ్‌ తెలిపాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో టమాటాలను కాపాడుకోవడానికే బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు.

ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లా గోనిసోమనహళ్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన పొలంలో దొంగలుపడ్డారు. సుమారు 60బస్తాల టమాటాలను ఎత్తుకెళ్లారు. వాటి విలువ రెండున్నర లక్షలు ఉంటుందని బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లోకిలో టమాట ధర 160 రూపాయల పైగా ఉండటంతో పంటను కోసి బెంగళూరుకు తరలించాలని భావిస్తున్న క్రమంలో చోరీ జరిగినట్లు చెప్పారు. టమాట బస్తాలను ఎత్తుకెళ్లటమే కాకుండా మిగిలిన పంటను కూడా ధ్వంసం చేశారని బాధిత మహిళా రైతు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story