Rapido-Uber: ఏం టార్చర్‌ రా ఇది.. 45 నిమిషాల ప్రయాణానికి 3.5 గంటల సమయం

Rapido-Uber: ఏం టార్చర్‌ రా ఇది.. 45 నిమిషాల ప్రయాణానికి 3.5 గంటల సమయం
X
45 నిమిషాల సమయం పట్టే ప్రయాణం కోసం, 225 నిమిషాల వెయిటింగ్ సమయం వేచి ఉండాలని వెల్లడించింది. దీంతో అవాక్కవడం ఆ వ్యక్తి వంతైంది.

IT హబ్ బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంటుంది. వారాలు, వారాంతాలతో సంబంధం లేకుండా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాల బస్సులు, ప్రైవేట్ వాహనాల రద్దీతో నిత్యం ట్రాఫిక్ జాంలు సర్వసాధారణం అయ్యాయి. వ్యక్తిగత వాహనాలకు బదులుగా క్యాబ్‌లు బుక్ చేసుకునే వారి జేబులకు చిల్లు పడుతుంది.

అయినా సరే అని ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్న ఓ బెంగళూరు వాసికి వింత అనుభవం ఎదురైంది. 45 నిమిషాల సమయం పట్టే ప్రయాణం కోసం, ఆటో రావడానికి 225 నిమిషాలు వేచి ఉండాలని వెల్లడించింది. దీంతో అవాక్కవడం ఆ వ్యక్తి వంతైంది.


దీనికి సంబంధించిన ఫోన్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X (ట్విట్టర్‌)లో షేర్ చేశాడు. రైడింగ్ వాహనాల కోసం వేచి చూసే సమయంపై నియంత్రణ లేకుండా పోతోందన్నాడు.

"45 నిమిషాల ప్రయాణానికి 3.7 గంటల వెయిటింగ్ సమయం వేచి చూడాలి. ర్యాపిడో వెయిటింగ్ సమయానికి నియంత్రణ లేకుండా పోతోంది." అని పోస్ట్ చేశాడు. తన ఆవేదనను వ్యక్తపరిచేలా ఏడుస్తున్న ఎమోజీని ఉంచాడు. పాపులర్ #pakbengaluru యాష్ ట్యాగ్‌ని జతచేశాడు.

దీనిపై స్పందించిన ర్యాపిడో కంపెనీ, ఇది సాంకేతిక సమస్య అని వెల్లడించింది.

"ఇది సాంకేతిక సమస్యలా అన్పిస్తోంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని మాకు మెసేజ్‌ చేయండి. మీకు సహాయ పడతాము" అని సమాధానం ఇచ్చింది.

ఇటువంటి సంఘటనే మరో వ్యక్తికి ఎదురైంది. ఉబెర్ ఆటో బుక్ చేసుకున్న వ్యక్తికి 24 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆటో రావడానికి 71 నిమిషాల వెయింటింగ్ సమయం చూయించడంతో ఆశ్చర్యపోయాడు. దీనిని కూడా ఎక్స్‌లో పోస్ట్ చేయగా యూజర్లు వివిధ రకాలుగా స్పందించారు.

మీరు నిజంగా అంత సేపు వేచి చూస్తే మీకు నమస్కరిస్తాను అని ఓ యూజర్ కామెంట్ చేయగా, డ్రైవర్ 1 నిమిషం తర్వాత రైడ్ క్యాన్సిల్ చేశాడని ఆ వ్యక్తి బదులిచ్చాడు.



Tags

Next Story