ChatGPT: పెళ్లి కూడా చేసేసిన చాట్‌జీపీటీ
ప్రస్తుతం ఎక్కడ చూసినా చాట్ జీపీటీ (Chat GPT) గురించే చర్చ జరుగుతోంది. టెక్నాలజీలో కొత్త ఒరవడి సృష్టించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ మరో పని చేసి మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. చాట్‌జీపీటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నది. ఒక్క క్లిక్‌తో సమాచారాన్ని ఇవ్వడమే కాదు పెళ్లిళ్లు కూడా చేసేస్తాని నిరూపించింది. అమెరికాలోని కొలొరాడోలో నిజంగా జరిగిందీ ఘటన. పెళ్లి నిర్వహించే మతాధిపతిగా మారి అమెరికాలో నవ దంపతులను ఒక్కటి చేసింది. కొలరాడోలో రీలి అలిసన్ వించ్, డెటాయిన్ ట్రుయిట్‌ల వివాహానికి పెద్దలు నిశ్చయించారు. వినూత్నంగా ఉండాలని ఆలోచించిన ఆ జంట మతాధిపతికి బదులుగా తమ పెండ్లి చేసే బాధ్యతలను చాట్‌జీపీటీకి అప్పగించారు.
పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మధ్య చాట్‌జీపీటీతో కనెక్ట్ చేసిన స్పీకర్ పెట్టారు. దానికో రోబోటిక్ మాస్క్ తగలించారు. ఇంకేముంది పెళ్లికి వచ్చిన వాళ్లను అది ఆహ్వానించింది. అదే పెళ్లి పెద్దగా ఉండి అన్ని పనులూ చక్కదిద్దింది. వాయిస్ యాప్‌తో అందరికీ వెల్‌కమ్ చెప్పింది. అమెరికాలోని జంటలకూ పెళ్లి చేసేందుకు ప్రత్యేకంగా వ్యక్తులుంటారు. వాళ్లనే అఫీషియెంట్ అంటారు. అలా జరిగితేనే వాటిని లైసెన్స్‌డ్ మ్యారేజ్‌లుగా పరిగణిస్తారు. చాట్ జీపీటీ.. అఫీషియెంట్‌గా మారి పెళ్లితంతును అంగరంగ వైభవంగా జరిపించింది. అతిథులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు..? వాళ్లను ఎలా పలకరించాలి..? అని ముందుగానే ఆ చాట్‌బాట్‌కి గైడెన్స్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే గెస్ట్‌లను పలకరించింది. పెళ్లికి వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపి చాట్ జీపీటీ పెళ్లికి టెక్నికల్ టచ్ ఇచ్చింది.
చాట్‌జీపీటీ వంటి అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి టూల్స్‌తో ఉద్యోగాలకు ముప్పు వస్తుందని ఇటీవల కాలంలో చాలా మంది మేదావులు వ్యక్తం చేస్తున్నారు.పని ప్రదేశంలో చాట్‌జీపీటీ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాసాలు, ప్రసంగాలు రాయడం, క్లిష్టమైన గణిత సమీకరణాలకు జవాబులు చెప్పడం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కఠినమైన కోడ్‌లు రాసిపెట్టడం.. ఇలా అన్నింటినీ ఈ కృత్రిమ మేధ చకచకా చేసేస్తుండడంతో రాబోయే రోజుల్లో కొన్ని ఉద్యోగాల స్థానంలో ఏఐని వినియోగిస్తారనే వాదన బలపడుతోంది. మరోవైపు పలు దేశాలు చాట్‌జీపీటీని బ్యాన్ చేస్తున్నాయి.
ఇంకో వైపు దీన్ని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలో కొన్ని కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. భవిష్యత్ కోసం చాట్‌జీపీటీ మంచిదేనని, ఉద్యోగులకూ ఇది సహకారంగా ఉంటుందని భావిస్తున్నామని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. ఉత్పాదకత పెంచడం, పనిలో స్థిరత్వం, పాలనా అవసరాన్ని తగ్గించడం, వేగంగా డెలివరీ చేయడం వంటి వాటికి చాట్‌జీపీటీ ఎంతో దోహదపడతాయని చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com