CHINA: మంత్రి అదృశ్యం... లవ్ యాంగిల్ అంటూ పుకార్లు..

చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ (Qin Gang) కనపపడం లేదు. మీరు వింటున్నది నిజమే.. చైనా((China)లో మొన్న జాక్ మా కొన్ని నెలల పాటు బాహ్య ప్రపంచానికి కనపడలేదు. ఇప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రే నెలరోజులుగా అదృశ్యమైపోయారు. దీంతో జిన్‌పింగ్ సర్కారు అణచివేతలో భాగంగానే ఆయన అదృశ్యమయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ఆయన కనపడక పోవడం ప్రపంచ దేశాలను విస్మయపరిచింది. అసలు ఆయన ఏమైపోయారన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న క్విన్ గాంగ్ గతంలో అక్కడ చైనా రాయబారిగా కూడా పనిచేశారు. యూఎస్‌తో సంబంధాలు గాడిన పెట్టేందుకు జరుగుతున్న ఉన్నతస్థాయి దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్న సమయంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది.
చైనా ప్రభుత్వాన్ని ధిక్కరించిన వ్యాపార, రాజకీయ వర్గాల పలువురు ప్రముఖులు డ్రాగన్ అణచివేత కారణంగా గతంలో నెలల తరబడి అదృశ్యమయ్యేవారు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వంలోని మంత్రే కన్పించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ (Foreign Minister Qin Gang) గత మూడు వారాలకు పైగా ప్రజా జీవితంలో కన్పించట్లేదు. ఆయన అదృశ్యంపై బీజింగ్ సర్కారు కూడా సరైన కారణాలు వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
కిన్ గాంగ్ (Qin Gang) గతేడాది డిసెంబరులోనే విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అమెరికాకు చైనా (China) రాయబారిగా ఉన్న ఆయనకు.. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పదోన్నతి కల్పించారు. అయితే గత కొన్ని రోజులుగా కిన్ గాంగ్ అధికారిక కార్యక్రమాల్లో కన్పించట్లేదు. చివరిసారిగా ఈ ఏడాది జూన్ 25న బీజింగ్‌లో జరిగిన సమావేశంలో శ్రీలంక, వియత్నాం, రష్యా అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఇటీవల జరిగిన అసియాన్ సమావేశానికి గాంగ్ హాజరుకాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని అప్పట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాంగ్ స్థానంలో చైనా కీలక దౌత్యవేత్త వాంగ్ యీనే విదేశాంగ శాఖ బాధ్యతలను సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. గతవారం జరిగిన అసియాన్ సదస్సుకు వాంగ్ యీనే హాజరయ్యారు. అంతకుముందు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తోనూ ఆయనే భేటీ అయ్యారు.
కిన్ గాంగ్ (Qin Gang) అదృశ్యంపై చైనా విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పడం గమనార్హం. మరోవైపు గాంగ్ గురించి ఆన్‌లైన్‌లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా పౌరురాలైన టీవీ జర్నలిస్టు ఫు షియోటియాన్‌తో గాంగ్ ప్రేమలో ఉన్నట్లు చైనీస్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హాంకాంగ్‌కు చెందిన ఓ మీడియా సంస్థలో ఆమె పనిచేస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని, ఆ పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నారని సదరు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వదంతులపై చైనా ప్రభుత్వం స్పందించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com