Kerala: స్కూలుకు సెలవులు వద్దు.. ఏకంగా కలెక్టర్‌కు లేఖ రాసిన విద్యార్థిని..

Kerala: స్కూల్ సెలవులంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. అసలు స్కూలుకు సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని విద్యార్థులు ఎదురుచూస్తారు. కానీ కొందరు పిల్లలు మాత్రం స్కూలు ఉంటేనే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. కొందరి విద్యార్థులకు ఇంట్లో ఉండి ఆటలు ఆడుకోవడం కంటే స్కూలుకు వెళ్లి పాఠాలు వినడం ఎక్కువగా నచ్చుతుంది. అలాంటి ఓ విద్యార్థిని చేసిన పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇటీవల కేరళలో పలు కారణాల వల్ల స్కూళ్లకు వరుసగా సెలవులు వచ్చాయి. అందులో భారీ వర్షాలు కూడా ఓ కారణం. అందులో మొహర్రంకు కూడా ఓ సెలవు ప్రకటించారు. అలా శనివారం నుండి మంగళవారం వరకు సెలవులు వచ్చాయి. ఇదే విషయంపై వయనాడ్‌కు చెందిన సఫూరా నౌషాద్ అనే 6వ తరగతి విద్యార్థిని ఏకంగా కలెక్టర్‌కు మెయిల్ చేసింది. 'వరుసగా నాలుగు రోజులు ఇంట్లో కూర్చోవడం కష్టం. దయచేసి బుధవారం క్లాసులు పెట్టండి' అని ఆ మెయిల్‌లో రాసుకొచ్చింది.
ఈ మెయిల్‌ను స్క్రీన్‌షాట్ తీసి కలెక్టర్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మెయిల్ పంపిన సఫూరా నౌషాద్‌ను అభినందిస్తూ.. మన చిన్నారులు చాలా తెలివైన వారని, వారి ఆలోచనలు విశాలమైనవి పోస్ట్ చేశారు. ఈ ప్రపంచ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, చిన్నారులు ఈ తరానికి గర్వకారణం అని ప్రశంసించారు కలెక్టర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com