CHATGPT: చాజ్‌జీపీటీపై దావా

CHATGPT: చాజ్‌జీపీటీపై దావా
చాట్‌జీపీటీపై దావా వేసిన హాస్య నటి.... అనుమతి లేకుండా తన సమాచారాన్ని వాడుకున్నారన్న సారా.... మెటాపైనా దావా వేసిన నటి....

అందుబాటులోకి వచ్చిన అనతి కాలంలోనే నెట్‌ ప్రపంచాన్ని దున్నేస్తున్న కృత్రిమ మేధ సహాయంతో పనిచేసే చాట్‌జీపీటీపై దావా దాఖలైంది. తన అనుమతి లేకుండా తన సమాచారాన్ని ఉపయోగించినందుకు చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ ఏఐపై హాస్యనటి, రచయిత సారా సిల్వర్‌మాన్ కేసు దాఖలు చేశారు. చాట్‌జీపీటీతో పాటు మెటా సీఈవో జుకర్‌బర్గ్‌పైనా ఆమె దావా వేశారు. ఈ రెండు కంపెనీలు తన అనుమతి లేకుండా తాను రాసిన పుస్తకాల్లోని విషయాలను ఉపయోగించాయని సారా దావాలో పేర్కొన్నారు. ది బెడ్‌ వెట్టర్‌ పుస్తకంలోని కంటెంట్‌ను ఈ రెండు సంస్థలు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వినియోగించుకున్నాయని వివరించారు. చాట్‌బాట్‌కు శిక్షణ ఇచ్చేందుకు తన పుస్తకంలోని కంటెంట్‌ను వాడుకోవడానికి తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని సారా తెలిపారు.


చాజ్‌జీపీటీపై ఇంతకుముందు కూడా దావాలు, కేసులు దాఖలయ్యాయి. అరరత్‌ పుస్తకాన్ని రచించిన క్రిస్టోఫర్ గోల్డెన్, శాండ్‌మ్యాన్ స్లిమ్‌ను రాసిన రిచర్డ్ కాడ్రే కూడా తమ అనుమతి లేకుండా కంటెంట్‌లను ఉపయోగించినందుకు కంపెనీపై దావా వేశారు. తమ సమాచారాన్ని వాడుకున్నందుకు నష్ట పరిహారం ఇప్పించాలని ఈ ముగ్గురు రచయితలు కోరుతున్నారు. మెటా కూడా ఇలాంటి దావాలను ఎదుర్కొంటోంది. మెటా, ఓపెన్‌ ఏఐ తమ భాషా నమూనాలను అభివృద్ధి చేసేందుకు తమ అనుమతి లేకుండా సమాచారాన్ని వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కృత్రిమ మేధ సాధనాలు తరచుగా కాపీరైట్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రచయితల కంటెంట్‌కు కాపీరైట్ చట్టాల ద్వారా రక్షణ ఉంటుంది. వాటిని అనుమతి లేకుండా వినియోగిస్తే నేరంగా పరిగణిస్తారు.


అమెరికాకు చెందిన ‘ఓపెన్‌ఏఐ’ అనే సంస్థ సృష్టించిన చాట్‌ జీపీటీ’ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్‌బాట్‌. 2021 నవంబరు 30న దీన్ని విడుదల చేసిన అయిదు వారాల్లోనే 10 లక్షల మంది వినియోగదారులను సంపాదించింది. వికీపీడియా, దేశదేశాల పత్రికలు, ఆన్‌లైన్‌ గ్రంథాల్లో అందుబాటులో ఉన్న లక్షల పుటల సమాచారాన్ని సంగ్రహించిన చాట్‌ జీపీటీ మన ప్రశ్నలకు సమాధానాలను అపార విజ్ఞాన భాండాగారం నుంచి క్షణాల్లో సేకరించి రాతపూర్వకంగా అందిస్తుంది. సమాచారంలోని సారూప్యతలను, భేదాలను సమన్వయపరచి జవాబులిస్తుంది. అందుకే, ఇది మనుషులనే మించిపోతుందేమోననే భయాలు మొదలయ్యాయి. చాట్‌ జీపీటీ వినియోగంతో సృజనాత్మక ఆధారిత రంగాలకు ముప్పు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.


తక్కువ స్థాయి నైపుణ్యం సరిపోయే ఉద్యోగాలతోపాటు ఉన్నత నైపుణ్యాలు కావలసిన ఉద్యోగాలు, వృత్తులు కూడా కృత్రిమ మేధ వల్ల గల్లంతవుతాయన్న భయాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలను గ్రహించి ఐక్యరాజ్యసమితి కృత్రిమ మేధకు నైతిక ప్రమాణాలను సిఫార్సు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రాతిపదిక పత్రాన్ని 2021 నవంబరులో 193 సభ్య దేశాలు ఆమోదించాయి.

Tags

Read MoreRead Less
Next Story