కానిస్టేబుల్ ధైర్యానికి హాట్సాఫ్.. పాముకి 'సీపీఆర్' ఇచ్చి ప్రాణాలు కాపాడి..
రేయింబవళ్లు డ్యూటీ చేస్తూ పోలీసులు మనుషుల ప్రాణాలకు రక్షణగా ఉంటారు. అవసరమైతే అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులకు సీపీఆర్ ఇచ్చి మరీ ప్రాణాలు కాపాడతారు. ఇదంతా సాధారణమే అయినా ఒక అసాధారణ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పాము కనిపిస్తేనే భయపడతాం.. మనం వాటి జోలికి వెళ్లకపోతే అవి ఏమీ చేయవని తెలిసినా విషసర్పం కనపడితే భయంతో వణికిపోతాం, చంపాలని ప్రయత్నిస్తాం. కానీ ఆ కానిస్టేబుల్ మాత్రం ఒక ప్రాణిని అన్యాయంగా చంపే హక్కు మనకు లేదనే మంచి మనసుతో అది అపస్మారక స్థితిలో ఉందని తెలిసి, మనుషులకు ఇచ్చినట్లుగా పాముకి కూడా సీపీఆర్ ఇచ్చి దాని ప్రాణాలు కాపాడాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్లు కానిస్టేబుల్ కు హాట్సాఫ్ చెబుతున్నారు.
క్రిమిసంహారక మందు కలిపిన నీటిని తాగి కదలలేకుండా ఉన్న పాముని బతికించే ప్రయత్నం చేశారు పోలీస్ కానిస్టేబుల్. నోటి నుండి గాలిని ఊదా పాముకి ఆక్సిజన్ అందించి అది బతికేందుకు తోడ్పడ్డారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన ఒక పశువైద్యుడు మీడియాతో మాట్లాడుతూ, CPR పాముని బతికించదని, అది స్వయంగా స్పృహలోకి వచ్చి ఉండవచ్చునని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో చోటు చేసుకుంది. నిత్యం జనం రద్దీగా ఉండే ఓ కాలనీలోని పైపులైన్‌లోకి పాము ప్రవేశించింది. పైపు లోపల నుండి దానిని తొలగించడానికి నివాసితులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, వారు పైపులోకి పురుగుమందు కలిపిన నీటిని పోశారు. దీంతో పాము బయటకు వచ్చింది. ఏం చేయాలో తెలియక స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు.
కాల్ అందుకున్న కానిస్టేబుల్ అతుల్ శర్మ హుటాహుటిన కాలనీకి వెళ్లి పామును రక్షించారు. శర్మ పామును నిశితంగా పరిశీలించి , అది ఊపిరి పీల్చుకుంటుందో లేదో గమనించారు. నీరసంగా పడి ఉన్న పాముకి సీపీఆర్ అందించారు. అతను పాము నోటిలోకి గాలిని ఊది ప్రాణాలు కాపాడారు. ఈ వింత చర్యను గమనిస్తున్న స్థానికులు పాముపై నీటిని చిలకరించారు. దాంతో దానికి కాస్త ఊపిరి వచ్చి కదలడం ప్రారంభించింది. అనంతరం దానిని తీసుకువెళ్లి అడవిలో వదిలిపెట్టారు. గత 15 ఏళ్లలో 500 పాములను రక్షించినట్లు శర్మ పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com