కష్టపడి జస్ట్ పాస్... మిన్నంటిన సంబరాలు

కష్టపడి జస్ట్ పాస్... మిన్నంటిన సంబరాలు
పిల్లలు సాధించే కొద్దిపాటి విజయానికి కూడా మనస్ఫూర్తిగా ఆనందించిన ఒక తల్లిదండ్రుల స్పందన ఇది.

ప్రస్తుత కాలంలో విద్యార్థులు కంటే తల్లిదండ్రులే మార్కుల వేటలో పడిపోయారు. తన కొడుక్కి మంచి మార్కులు వచ్చాయి అంటే తన కూతురికి ఇంకా బాగా మార్కులు వచ్చాయని చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నారు. అయితే ఇదంతా బాగా మెరిట్ వచ్చిన కొందరు విద్యార్థుల ఇళ్లల్లో సంగతి. కానీ ఇంకొందరు ఉంటారు వంద మార్కులకు ఒక మార్కు తగ్గి 99 మార్కులు వచ్చినా నిరుత్సాహం, నిస్పృహలో కూరుకుపోతారు. ఇలా ఫీల్ అయ్యేది విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు కూడా.

తక్కువ మార్కులు వస్తే జీవితంలో ఇంకేం సాధిస్తావ్ అనీ, నీకోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాము, నువ్వు చదవకుండా మా పరువు తీసేసావంటూ పిల్లల మీద మాటలతో దాడి చేస్తారు. తల్లిదండ్రుల వైపు నుంచి చూస్తే ఇది నిజం కావచ్చు ఏమో. కానీ కొందరు పిల్లలు ఈ అవమానాన్ని మరిచిపోలేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. పదవ తరగతి ఫలితాలు విడుదలైన ప్రతిసారీ ఇలాంటి వార్తలు మనం ఎన్నో చదువుతాం. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న విషయం అలాంటిది కాదు.

పిల్లలు సాధించే కొద్దిపాటి విజయాన్ని కూడా మనస్ఫూర్తిగా ఆనందించిన ఒక తల్లిదండ్రుల సంగతి ఇది . మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పదవ తరగతి ఫలితాలు విడుదల చేసింది. ఇందులో ఠాణేకి చెందిన కరద్ విశాల్ అశోక్ అనే విద్యార్థి అన్ని పరీక్షల్లో 35 మార్కులతో గట్టెక్కాడు. ఇలా జరిగినందుకు నిజానికి ఆ కుటుంబం బాధలో కూరుకు పోవాలి. అటు తల్లిదండ్రులు ఇటుకొడుకు కూడా ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండిపోవాలి. కానీ ఆ విద్యార్థి ఇంట్లో అలా జరగలేదు. తమ కొడుకు కష్టపడి చదివి పాస్ అయ్యాడు అంటూ తల్లిదండ్రులు సంబరాలు చేసుకున్నారు.

తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహంతోనే తాను పాసైనట్టు ఆ విద్యార్థి తెలిపాడు. విద్యార్థి తండ్రి ఆటో డ్రైవర్ కాగా తల్లి గృహిణి. అవనీష్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తల్లిదండ్రుల సానుకూల దృక్పథాన్ని ఆయన అభినందించారు. కేవలం మార్కుల ద్వారా ఎవరి ప్రతిభను అంచనా వేయలేమంటూ ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది

Tags

Read MoreRead Less
Next Story