విద్యార్ధుల ముందే కొట్టుకున్న టీచర్లు.. వీళ్లేం ఉపాధ్యాయులు..

ఉపాధ్యాయులంటే విద్యార్ధులకు ఆదర్శంగా ఉండాలి.. ప్రవర్తన, నడవడి ఒకటేమిటి అన్నింటా వారిని రోల్ మోడల్‌గా తీసుకుంటారు విద్యార్ధులు.. మరి ఈ మధ్య కాలంలో ఇలా తయారవుతున్నారేంటి.. వాళ్ల వయసుని, వృత్తిని, సంస్కారాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఉపాధ్యాయులపట్ల ఉన్న గౌరవమర్యాదలను పోగొట్టేలా చేస్తోంది. పాట్నాలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న గొడవ కాస్తా పెద్దదిగా మారి తారాస్థాయికి చేరుకుంది. చెప్పుతో కొట్టడం, జుట్టు పట్టి లాగడం.. చూసేవారికి వీళ్లు టీచర్లేనా అని అనిపించేలా ప్రవర్తించారు.
సంఘటన దృశ్యాలు కుస్తీ పోటీలను తలపించేలా ఉన్నాయి. తమలో తాము దూషించుకుంటూ, పోట్లాడుకుంటూ విద్యార్ధుల ముందు నీచంగా ప్రవర్తించారు. ఎవరికి విద్యాబుద్దులు నేర్పిస్తున్నారో వారు తమను గమనిస్తున్నారనే విషయం మరిచి పోయారు. కొందరు విద్యార్ధులు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన బిహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌడియా స్కూల్ లో జరిగింది.
సమాచారం ప్రకారం, పాఠశాల మూసివేసిన తర్వాత తరగతి గది కిటికీని మూసివేయడంపై పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి, మరియు రెండవ బ్లాక్ టీచర్ అనితా కుమారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాదన కొట్టుకునే వరకు వెళ్లింది. పాఠశాలలో ఉన్న ఇతర ఉపాధ్యాయులు ఇద్దరినీ వేరు చేయపోగా సినిమా చూసినట్టు చూస్తున్నారు. పాఠశాలకు సంబంధించిన ఇతర సిబ్బంది వచ్చి వారి గొడవను ఆపే ప్రయత్నం చేశారు. మహిళా టీచర్లకు సంబంధించిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎడ్యుకేషన్ అధికారి దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com