Viral Video: తెగిన పారాచూట్ తాడు.. దంపతులిద్దరూ సముద్రంలో..

Viral Video: తెగిన పారాచూట్ తాడు.. దంపతులిద్దరూ సముద్రంలో..
Parasailing: దీంతో దంపతులిద్దరు సముద్రంలో పడిపోయారు. బోటులో ఉన్న అజిత్ కథడ్ సోదరుడు రాకేశ్ భయంతో అరవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటిలో దూకి వారిని రక్షించారు.

Parasailing: అడ్వంచర్లు చేయాలని ఎవరికైనా ఉంటుంది కానీ.. అందుకు ఎంతో గుండె ధైర్యం కావాలి. పారాచూట్ సాయంతో ఆకాశంలో విహరిస్తున్న దంపతులకు అనుకోని సంఘటన ఎదురై అంతెత్తునుంచి సముద్రంలో పడ్డారు. అదృష్టం బావుండి వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.

గుజరాత్‌కు చెందిన అజిత్ కథడ్ (30), సరళా కథడ్ (31) దంపతులు వీకెండ్‌ని ఎంజాయ్ చేస్తూ దయూలోని నంగావ్ బీచ్‌కు వెళ్లారు. అక్కడ పారాసెయిలింగ్ చేయాలని ఆశపడ్డారు. నిర్వాహకులు పవర్ బోటు నుంచి వారిని పారాచూట్‌లో పైకెగరేశారు. అయితే వారు పైకి వెళ్లిన కొద్దిసేపటికే బోట్ నుంచి పారాచూట్‌కు కట్టిన తాడు ఒక్కసారిగా తెగిపోయింది.

దీంతో దంపతులిద్దరు సముద్రంలో పడిపోయారు. బోటులో ఉన్న అజిత్ కథడ్ సోదరుడు రాకేశ్ భయంతో అరవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటిలో దూకి వారిని రక్షించారు. లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారు నీటిలో మునిగిపోలేదు. ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాడు బలంగా లేదని ముందే చెప్పినా సిబ్బంది సీరియస్‌గా తీసుకోలేదని రాకేశ్ చెబుతున్నాడు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని అజిత్ వాపోతున్నాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాం కాబట్టి సరిపోయింది అని అంటున్నాడు. ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు దంపతులిద్దరు.

Tags

Next Story