Guntur Subbamma: సుబ్బమ్మ 111వ పుట్టినరోజు.. తరలి వచ్చిన అయిదు తరాల కుటుంబం..

Guntur Subbamma: ఇప్పటితరంతో పోలిస్తే ఒకప్పటి తరం వారు చాలా బలంగా ఉండేవారు అన్న మాట మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. అది నిజమే అని నిరూపించడానికి ఇంకా కొందరు 100 ఏళ్లు దాటినా.. ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వారిలో ఒకరు గుంటూరు జిల్లాలో ఉండే సుబ్బమ్మ. ఈ భామ వయసు 110 సంవత్సరాలు. ఇటీవల ఈమె తన 111వ ఏట అడుగుపెట్టింది. దీంతో కుటుంబంతా కలిసి ఈమెకు బర్త్‌డే వేడుకలు జరిపారు. ఇది చూడడానికి ఊరంతా కదలి వచ్చింది.
పడమటి పాలం రాజవోలు ప్రాంతానికి చెందిన వెంకట సుబ్బమ్మ 111వ పుట్టినరోజుకు తన అయిదు తరాల కుటుంబం తరలి వచ్చింది. మొత్తం 97మంది కుటుంబ సభ్యులు తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. సుబ్బమ్మకు మొత్తం 9మంది పిల్లలు. ఇందులో ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. వీరందరికీ పిల్లలు, మనవళ్లు కూడా ఉన్నారు. అయితే చాలాకాలం క్రితం వారివారి వృత్తుల కోసం ఊరిని వదిలేసి వెళ్లిన వీరు మళ్లీ సుబ్బమ్మ 111వ పుట్టినరోజు కోసం ఊరికి తిరిగొచ్చారు.
111వ ఏళ్ల సుబ్బమ్మ ఇప్పటికీ తన పనే తానే చేసుకుంటుందట. పైగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఇప్పటికీ ఏ సమస్య లేకుండా జీవిస్తుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. పైగా 40 ఏళ్లుగా సుబ్బమ్మ ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ జీవిస్తుందట. ముగ్గులు వేయడం, తిరగలి పట్టడం లాంటి పనులు చేయడంలో కూడా ఇప్పటికీ సుబ్బమ్మ చాలా యాక్టివ్ అని తన కుమారులు చెప్తున్నారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్యం సమయంలో తాను చిన్న పిల్లగా ఉన్నప్పుడు తెనాలిలో మహాత్మ గాంధీ ప్రసంగానికి వెళ్లానని సుబ్బమ్మ గుర్తుచేసుకుంది. తాను స్వయంగా స్వాతంత్ర్య యుద్ధాన్ని చూశానని, ఎంతోమంది అమరవీరులు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని చెప్తోంది. ప్రస్తుతం ఈ భామ పుట్టినరోరజు విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com