'బుల్లెట్టు బండి కపుల్స్'కి సన్మానం.. వచ్చిన పాపులారిటీని ఎలా వాడుకోబోతున్నారు?
సోషల్‌మీడియా వచ్చాక ఏదైనా వైరల్ అవ్వడం అనేది క్షణాల్లోనే జరిగిపోతుంది. అది పోస్ట్ అవ్వని, వీడియో కానీ... ఇంకేమైనా.. చాలా మందిని సోషల్ మీడియా ఓవర్ నైట్‌లో స్టార్ లని చేసేస్తుంది. ఆ మధ్య టిక్‌టాక్ వచ్చాక సాధారణ వ్యక్తులు కూడా సెలబ్రిటీలు అయిపోయారు. అందుకు ఉదాహరణ దుర్గారావే.. 'నక్కిలీసు గొలుసు' పాటకి మనోడు చేసిన డాన్స్‌కి వీడియో వైరల్ అవ్వడం, దుర్గారావు సెలబ్రిటీ అవ్వడం చూస్తుండగానే జరిగిపోయింది. వచ్చిన పాపులారిటీని దుర్గారావు కూడా బాగానే క్యాష్ చేసుకున్నాడు. జబర్దస్త్, క్యాష్ లాంటి ప్రోగ్రాంలలో కనిపించి వచ్చిన ఫేమ్‌ని మరింతగా పెంచుకున్నాడు. బహుశా ఇప్పుడు దుర్గారావు అంటేనే తెలియని వాళ్ళు ఉండరేమో.
ఇదిలావుండగా తాజాగా ఓ పెళ్లి కూతురు తన పెళ్లి బరాత్‌లో 'బుల్లెట్టు బండి' పాటకి డాన్స్ చేసి ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపొయింది. అయితే వీడియో ఇంత వైరల్ అవుతుందని ఆమె కూడా ఉహించి ఉండదు. ఏకంగా వారికి బుల్లెట్టు బండి కపుల్స్ అనే ఓ పేరు కూడా పెట్టేశారు నెటిజన్లు.. పెళ్లి తర్వాత ఈ జంట వేములవాడ లోని టెంపుల్ కి వెళ్తే అక్కడ కూడా వీరిని చూసేందుకు జనం ఎగబడ్డారు. మీడియా కూడా ఈ కపుల్స్ కవరేజీ కోసం పోటీ పడింది. అయితే వధువు తండ్రి రాము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యాక్షుడిగా పని చేస్తుండడంతో.. వారు నూతన జంటకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వారికి శాలువాతో ఘనంగా సన్మానించారు. సన్మానం ఆనందంగా ఉందని దంపతులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇలా వచ్చిన పాపులారిటీని ఈ జంట ఏ రకంగా వాడుకోబోతున్నారో చూడాలి మరి. కాగా ఆ నవవధువు పేరు సాయిశ్రీయ కాగా, వరుడి పేరు ఆకుల అశోక్.. వీరికి ఈ నెల 14న వివాహం జరిగింది. సాయిశ్రీయ ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త అశోక్ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com