Indore: జిమ్ చేస్తూ కుప్పకూలిన హోటల్ యజమాని.. మూడు నిమిషాల్లో మృత్యుఒడిలోకి..

Indore: జిమ్ చేస్తూ కుప్పకూలిన సంఘటనలు ఈమధ్య తరచూ వింటున్నాము.. అయినా వర్కవుట్లు చేస్తూ శరీరదారుడ్యాన్ని పెంచుకునే క్రమంలోనే ఉన్నారు చాలా మంది.. తాజాగా ఇండోర్‌లోని జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ సంఘటన గోల్డ్ జిమ్‌లోని స్కీమ్ నంబర్ 78లో చోటు చేసుకుంది. ప్రదీప్ రఘువంశీ అనే వ్యక్తి జిమ్‌లో వ్యాయామం చేసే క్రమంలో ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతూ హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 55 ఏళ్ల ప్రదీప్ హోటల్ బృందావన్ యజమాని.
దీనికి సంబంధించిన CCTV ఫుటేజ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రెడ్‌మిల్‌పై నడిచిన తర్వాత అతడు చెమటలు కక్కుతున్నాడు. అతడికి తన జాకెట్ తీసినప్పుడు తల తిరగడం ప్రారంభించింది. దగ్గరలో ఉన్న టేబుల్ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఏ మాత్రం నిలబడలేక కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన జిమ్ ట్రైనర్ అక్కడే ఉన్న ఇతర వ్యక్తుల సాయంతో ప్రదీప్‌ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ విషాద సంఘటనపై ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ, వర్క్ అవుట్ చేసే ముందు తప్పనిసరిగా మెడికల్ చెకప్ చేయించుకోవాలని అన్నారు. ఈరోజుల్లో అందరూ జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ డాక్టర్‌ని సంప్రదించకుండా ఎలాంటి ప్రొటీన్లు తీసుకోకూడదు'' అని చెప్పారు. జిమ్‌లో జాయిన్ అయితే తగినంత ప్రొటీన్, కార్బొహైడ్రేట్ తీసుకోమని సలహా ఇస్తుంటారు.. అది మీ శరీర పరిస్థితిని బట్టి డాక్టర్ నిర్ణయిస్తారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.. జీవితాలను అర్థాంతరంగా ముగించవద్దు అని డాక్టర్ వివరించారు.
"ప్రదీప్ రఘువంశీ మా పాత క్లయింట్. అతడు ప్రతిరోజూ జిమ్‌కి వస్తారు. ఈ రోజు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.. మూడు నిమిషాల్లో అంతా అయిపోయింది, "అని జిమ్ శిక్షకుడు చెప్పారు.
జిమ్ చేస్తూ ఓ వ్యక్తి చనిపోవడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్ ట్రెడ్‌మిల్‌లో ఉన్నప్పుడు భారీ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. అతను ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ పక్కకు ఒరిగిపోయాడని నివేదికలు వెల్లడించాయి. 2021లో దక్షిణాది సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మరణించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com