Kisbu Balloon Seller: సిగ్నల్స్ దగ్గర బెలూన్లు అమ్మే జీవితం.. ఒక్కరాత్రిలో అలా మారిపోయింది..

Kisbu Balloon Seller: ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం. పేరు, గుర్తింపు అనేవి ఎవరి చెంతకు ఎలా వస్తుందో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ఎవ్వరు ఎప్పుడైనా పాపులర్ అవ్వచ్చు. నిన్న ఒకలాగా ఉన్న వ్యక్తి.. ఈరోజు ఇంకెలాగా అయినా మారొచ్చు. తాజాగా కేరళలో ఓ అమ్మాయి ఓవర్‌నైట్ మోడల్ అయిపోయింది.
కిస్బూ అనే ఓ యువతి రాజస్థాన్‌లో పుట్టి పెరిగినా.. కేరళలో తన ఫ్యామిలీతో స్థిరపడింది. సిగ్నళ్ల దగ్గర, జంక్షన్ల దగ్గర బెలూన్‌లు అమ్ముకుని జీవనం సాగించే కుటుంబం వారిది. అలాగే ఓ రోజు ఓ జాతరకు బెలూన్లు అమ్మడానికి వెళ్లింది కిస్బూ. అంతే.. రాత్రికి రాత్రి తన జీవితం ఓ మలుపు తిరిగింది. ఆ మలుపు తనను ఒక్కసారిగా పాపులర్ చేసేసింది.
అర్జున్ కృష్ణన్ అనే ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కూడా కిస్బూ వెళ్లిన జాతరకే వెళ్లాడు. మామూలుగా క్యాండిడ్ ఫోటోలు తీసుకుంటూ ఉండగా తనకు కిస్బూ కనిపించింది. ఆ ఫోటో అనుకోకుండా తీసినా.. అది తనకు బాగా నచ్చింది. ఆ ఫోటోను కిస్బూతో పాటు తన తల్లికి కూడా చూపించాడు. వారి అనుమతితో ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అంతే అమాయకంగా బెలూన్ల మధ్యలో నిలబడి ఉన్న కిస్బూ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.
కిస్బూ ఫోటో వైరల్ అవ్వడంతో తనను మరింత అందంగా మార్చి కొన్ని ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు అర్జున్ కృష్ణన్. అంతే.. ఇప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో ఒకరుగా అయిపోయింది. అంతే కాకుండా ప్రస్తుతం కొన్ని బ్రాండ్ల ప్రకటనలకు కూడా కిస్బూ పనిచేస్తోంది. తన ఫోటో వల్ల కిస్బూ జీవితం మారిపోవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నాడు ఫోటోగ్రాఫర్ అర్జున్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com