Viral News: అతడికి 75, ఆమెకు 70.. ఓల్డేజ్ హోమ్‌లో వికసించిన ప్రేమ..

Viral News: ప్రేమకు వయసుతో పనేముంది.. ప్రేమించే హృదయం ఉండాలే కానీ ప్రేమ ఏ వయసు వారిలోనైనా చిగురులు తొడుగుతుంది. కన్నబిడ్డల ఆదరణకు గురై వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. కష్టసుఖాలు పంచుకుంటూ జీవితం వెళ్లదీస్తుంటారు. ఈ క్రమంలో ఓ వృద్ధజంట ప్రేమికులుగా మారారు. ఆశ్రమంలోని వారు ఆ ప్రేమికులకు పెళ్లి చేసి తమ ముచ్చట తీర్చుకున్నారు.
కొల్హాపూర్‌లోని 75 ఏళ్ల వృద్ధుడు వృద్ధాశ్రమంలో పరిచయమైన 70 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. హృదయాన్ని కదిలించే వీరి కథ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ ఈ జంటను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ప్రేమ చాలా గొప్పది. ఒక్కోసారి ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను పొందడం ఆలస్యం అవుతుందేమో కానీ, అందరి జీవితాల్లో ప్రేమ ఓ భాగం. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. మీ వయసు 20 లేదా 80 ఉండవచ్చు. ప్రేమించే గొప్ప మనసు, దాన్ని పొందాలనే ఆరాటం, మీ ప్రేమలో నిజాయితీ ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరు. 70 ఏళ్ల వయసులో కూడా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అని మరోసారి నిరూపించారు ఈ వృద్ధ ప్రేమికులు.
బాబూరావు పాటిల్ (75), అనుసయ షిండే (70) రెండేళ్ల నుంచి మహరాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని జానకి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. వృద్ధాశ్రమంలో అడుగుపెట్టే నాటికే బాబూరావు భార్యను కోల్పోయాడు. అనుసయ కూడా భర్తను కోల్పోయింది. ఇద్దరికీ అక్కడే పరిచయం ఏర్పడింది. ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకునే వారు. కబుర్లతో కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలోనే వారికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వారి మధ్య అభిమానం పెరిగి వృద్ధాశ్రమంలో ఒకరికొకరు ఆసరాగా మారారు.
బాబూరావు పాటిల్ కొద్దిరోజుల క్రితం అనుసయకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. అయితే, ఆమె మొదట అంగీకరించలేదు. వారం రోజులు ఆలోచించిన తరువాత, ఆమె అతని ప్రతిపాదనను అంగీకరించింది. జానకి ఆశ్రమంలో అంగరంగ వైభవంగా వీరిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. వృద్ధాప్యంలో ఒకరికొకరు ఆసరాగా ఉండేందుకు పెళ్లి చేసుకోవాలని ఇక్కడి ప్రజలు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com