Mammikka: 60 ఏళ్ల కూలీ.. ఉన్నట్టుండి సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు..

Mammikka: జీవితం అనేది మరునిమిషం ఎలా ఉంటుందో, ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవ్వరూ ఉహించలేరు. ఒక్కొక్కసారి అలాంటి ఊహించని విషయాలు జరిగినప్పుడు నమ్మడానికి చాలా సమయం పడుతుంది. మామూలుగా కూలీగా పనిచేసే 60 ఏళ్ల వృద్ధుడు మోడల్‌గా మారడం కూడా ఇలాంటిదే. కేరళకు చెందిన ఈ వ్యక్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియా అంతా చర్చించుకుంటోంది.
కేరళలోని కొడివల్లికి చెందిన మమ్మిక్కా ఓ సాధారణ కూలీ. ఒక సాదాసీదా షర్ట్ వేసుకొని, లుంగీ కట్టుకొని అదే ప్రాంతంలో తిరిగే ఓ మామూలు మనిషి. కానీ ఈ మమ్మిక్కా ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. తనను మోడల్‌గా పెట్టి కేరళకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్.. ఫోటోషూట్ చేశాడు. ఆ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షరీక్ వయాలీల్ అనే ఫోటోగ్రాఫర్ ఒకసారి మమ్మిక్కా ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి విపరీతంగా లైకులు వచ్చాయి. అంతే కాకుండా మమ్మిక్కా కొంచెం యాక్టర్ వినాయకన్‌లాగా ఉన్నాడన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అప్పుడే షరీక్‌కు ఒక ఐడియా వచ్చింది. మమ్మిక్కాను మోడల్‌గా పెట్టి ఓ ఫోటోషూట్ చేయాలని, అనుకున్నట్టుగానే ఫోటోషూట్ పూర్తి చేశాడు. ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
మమ్మిక్కా మేక్ ఓవర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు సాధారణంగా కనిపించే మమ్మిక్కా ఇంత స్టైలిష్‌గా కూడా ఉండగలడా అని కామెంట్ చేస్తున్నారు. స్టైలిష్ సూట్, చేతిలో ఐప్యాడ్ లుక్ మమ్మిక్కాను సోషల్ మీడియా స్టార్‌ను చేసేసాయి. 60 ఏళ్ల వయసున్న మమ్మిక్కా సినీ పరిశ్రమలోని చాలామంది సీనియర్ నటులకు పోటీ ఇవ్వగలడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com