TIGER FIGHT: వీడు మగాడ్రా బుజ్జి... చిరుతనే బంధించాడు
సాధారణంగా చిరుతపులి(Leopard) ఒక్కసారిగా దాడి చేస్తే ఏం చేస్తాం. భయంతో సగం చచ్చిపోతాం. చిరుత నుంచి ఎలాగోలా బయటపడేందుకు అక్కడి నుంచి పారిపోతాం. మహా అయితే దాన్ని తప్పించుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తాం. సినిమాల్లో అయితే హీరో చిరుతతో భీకర పోరాటం చేస్తాడు. ఆ పోరాట ఘట్టాన్ని మనం కళ్లప్పగించి మరీ చూస్తాం. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ట్రిపుల్ ఆర్ దాకా ఇలాగే చూసేశాం. కానీ నిజ జీవితంలో ఇలాంటివి జరిగితే అమ్మో అనుకుంటాం. కానీ కర్ణాటకలో ఓ యువ రైతు చిరుతతో భీకరంగా పోరాడాడు. అంతేనా దానిని తాళ్లతో బంధించి... తన బైక్ వెనకాల కట్టేసుకుని నేరుగా ఫారెస్ట్ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. ఈ ఘటన సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే...
కర్ణాటకలోని హసన్( Hassan) జిల్లాకు చెందిన దిన వేణుగోపాల్(Venugopal ) అలియాస్ ముత్తు రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం తన బైక్‌పై పొలానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఓ చిరుతపులి అకస్మాత్తుగా అతడి(Leopard-human conflicts)పై దాడి చేసింది. వేగంగా వచ్చి దూకడంతో ముత్తు తన బైక్(bike )తో పాటు కిందపడిపోయాడు. కిందపడిపోయిన ముత్తు(Muthu)పై చిరుత పంజా విసిరింది. తప్పించుకునే మార్గంలేక ముత్తు ఎదురుదాడికి దిగాడు. వెనక్కి తగ్గినట్టే తగ్గిన చిరుత మరోసారి పంజా విసిరింది. ఈసారి మరింత బలంగా చిరుతను చిత్తు చేశాడు.
తన వద్ద ఉన్న తాళ్లతో చిరుత పులి నాలుగు కాళ్లను కట్టేశాడు. అంతటితో ఆగకుండా తన బైక్ వెనకాల గొర్రెను కట్టిన కట్టి నేరుగా అటవీ శాఖ కార్యాలయానికి( Forest department) వెళ్లాడు. ముత్తు అలా వెళ్లడాన్ని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు ముత్తును ప్రశంసిస్తున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్‌కు ఏ మాత్రం తగ్గలేదని ట్వీట్ చేస్తున్నారు.
చిరుత పులితో వచ్చిన ముత్తును చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకుని వెంటనే చిరుతపులిని ఆసుపత్రికి తరలించారు. ముత్తుకు ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవని... స్వీయ రక్షణలో భాగంగానే చిరుత పులిని కట్టేశాడని అటవీ అధికారులు తెలిపారు. అవగాహన రాహిత్యంతోనే అతను ఇలా చేశాడని... వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు మరోసారి ఇలాంటివి చేయకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి ముత్తును వదిలేశామని తెలిపారు. ప్రస్తుతం చిరుత వైద్యుల పర్యవేక్షణలో ఉందని అటవీ అధికారులు తెలిపారు.
హాసన్ జిల్లా ప్రాంతంలో వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉంది. వన్యప్రాణులు ఇలా పొలాల్లోకి రావడం కొత్తేం కాదు. దీంతో అటవీ అధికారులు వన్యప్రాణుల భారీ నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com