Mark Zuckerber: ఎలాన్ మస్క్.. ఇక కాచుకో

మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో కేజ్ ఫైట్‌కు సిద్ధమవుతున్నారా.. అందుకోసం ఆయన కఠోర శిక్షణ పొందుతున్నారా.. తన శరీరాన్ని మరింత దృఢంగా మలుచుకుంటున్నారా... కండలు తిరిగి దృఢంగా ఉన్న జుకర్‌బర్గ్ ఫొటో దేనికి సంకేతం..చొక్కా లేకుండా ఫొటోను షేర్ చేసి మరీ మస్క్‌ను పోరాటానికి సిద్దంగా ఉండమని సవాల్ విసిరారా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. తాజాగా ఫైటర్లతో ఉన్న జుకర్‌బర్గ్ ఫొటో సోషల్ మీడియాను దున్నేస్తోంది. మస్క్.. ఇక కాసుకో అన్నట్లుగా ఉన్న ఆ ఫొటోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
చొక్కా లేకుండా అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్స్ (UFC) ఫైటర్లు ఇజ్రాయెల్ అడెసన్యా, అలెగ్జాండర్ వోల్కనోవ్స్కీలతో జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫొటోలకు పోజులిచ్చాడు. అనంతరం ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి దాని కింద దిస్ ఈజ్ సీరియస్ బిజెనెస్ అని కూడా రాశారు. మీతో శిక్షణ పొందడం గౌరవంగా భావిస్తున్నానని కూడా రాశారు. దీనికి స్పందించిన UFC స్టార్‌లు శిక్షణ పొందినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫైటర్లతో ఉన్న ఫొటోతో సోషల్ మీడియాలో మరోసారి జుకర్‌బర్గ్ ట్రెండింగ్‌గా మారారు. సిక్స్‌ను తలపించే శరీరం.. పక్కన ఇద్దరు ఫైటర్లతో ఉన్న జుకర్‌బర్గ్ ఫొటోను చూసి నెటిజన్లు రిప్లైలతో సోషల్‌మీడియా(social media)ను హోరెత్తిస్తున్నారు. ఛాంపియన్‌లతో శిక్షణ పొందిన జుకర్‌బర్గ్.. ఎలాన్ మస్క్(elon musk)తో కేజ్ ఫైట్ కోసం సిద్ధమవుతున్నారని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
మెటా సీఈవో కొన్ని రోజులుగా ఇద్దరు ఫైటర్లతో తీవ్ర శిక్షణ పొందుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నెవాడాలోని లేక్ తాహోలో ఉన్న జిమ్‌లో జుకర్‌బర్గ్ వీరి నేతృత్వంలో శిక్షణ పొందుతున్నారని వెల్లడించింది. లాస్ వెగాస్‌లోని జుకర్‌బర్గ్ ఇంటికి శనివారం రాత్రి మిడిల్ వెయిట్ ఛాంపియన్ అడెసన్య, ఫెదర్ వెయిట్ ఛాంపియన్ వోల్కనోవ్స్కీ వచ్చారని వెల్లడించాయి.
కొన్ని రోజులుగా మార్క్ జుకర్‌బర్గ్, మస్క్ 'కేజ్ ఫైట్'తో నెటిజన్లను ఆటపట్టిస్తున్నారు. ఈ క్రమంలో మెటా సీఈవో పోస్ట్ మరింత ఉత్సుకతను పెంచింది. అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ప్రమోషన్ కంపెనీ ప్రెసిడెంట్ డానా వైట్ జుకర్‌బర్గ్‌కు మస్క్‌కు మధ్య టెక్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com