Nandi Drinking Milk: ఇదెక్కడి వింత..! నందీశ్వరుడు పాలు తాగుతున్నాడు.. 27 ఏళ్ల క్రితం..

Nandi Drinking Milk: ఇదెక్కడి వింత..! నందీశ్వరుడు పాలు తాగుతున్నాడు.. 27 ఏళ్ల క్రితం..
Nandi Drinking Milk: ఎక్కడో ఢిల్లీలోని విఘ్నేశ్వరుడు పాలు తాగాడని దేశం మొత్తం విగ్రహాలకు పాలు తాగించడం మొదలుపెట్టింది.

Nandi Drinking Milk: సరిగ్గా 27 ఏళ్ల క్రితం దేశంలో ఓ వింత జరిగింది. 1995 సెప్టెంబర్‌ 21న ఢిల్లీలోని ఓ గణేష్ టెంపుల్‌లో వినాయకుడు పాలు తాగాడు. అంతే.. ఎక్కడో ఢిల్లీలోని విఘ్నేశ్వరుడు పాలు తాగాడని దేశం మొత్తం విగ్రహాలకు పాలు తాగించడం మొదలుపెట్టింది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేదు. ఆసేతు హిమాచలం వరకు వినాయక గుళ్లకు పరుగులు తీశారు.

మనదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న భక్తులు కూడా వినాయకుడి దగ్గరకు వెళ్లి పాలు తాగించడం మొదలుపెట్టారు. ఇంగ్లండ్‌లోని ఓ స్టోర్‌లో దాదాపు 12 వేల లీటర్ల పాలు అమ్ముడుపోయి సెన్సేషన్ సృష్టించింది. అప్పట్లో ఈ వార్త ఎంత సంచలనం అంటే.. ఏకంగా సైంటిస్టులు సైతం రంగంలోకి దిగారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైంటిస్ట్‌గా ఉన్న రాస్ మెక్‌డొవల్ ఏకంగా ప్రయోగాలు చేశారు.

ఓ వారం పది రోజుల పాటు ఈ తంతు విపరీతంగా జరిగింది. ఇవన్నీ నమ్మని నాస్తికులు సైతం.. అరె ఇదెలా సాధ్యం, ఇలా ఎలా జరుగుతోందని వాళ్లే కన్ఫ్యూజ్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. కాని, కొందరు మాత్రం సైంటిఫిక్ రీజన్స్‌ వెతకడానికి ప్రయత్నించారు. నిజంగా దేవుడే దిగొచ్చి పాలు తాగడం వేరు. దేవుడి విగ్రహాలు పాలు తాగడం వేరు. ఈ చిన్న లాజిక్‌తో ముందుకెళ్తేగాని అసలు నిజం ఏంటో బోధపడలేదు.

ఒక స్పాంజ్‌ని తీసుకుని నీళ్లలో పెడితే సహజంగానే అది నీళ్లను లాక్కుంటుంది. దీన్నే తలతన్యత అంటారు. లేదా సర్ఫేస్‌ టెన్షన్ అంటారు. ఈ సైన్స్ సూత్రం ఆధారంగానే మొక్కలు, చెట్లు తమ వేర్ల ద్వారా నీటిని పీల్చుకుంటాయి. అంతెందుకు ఒక క్లాత్‌ను నీటికి అంటించినా సరే.. ఆ తడి పాకుతూ పైకి వెళ్తుంది. అంటే నీటిని లాక్కుంటుంది.

దీపం వెలగడం వెనకున్న సైన్స్‌ కూడా ఇదే. ప్రమిదలో ఉన్న నూనెను దూది పీల్చుకుంటూ వెలుగుతుంది. ఈ గుణాన్నే తలతన్యత అని వివరించింది ఫిజిక్స్. ప్రస్తుతం దేవుడి విగ్రహాల విషయంలో జరుగుతున్నది కూడా అదే. కొన్ని రాతి విగ్రహాలు, ఇసుకరాయి లేదా మట్టితో తయారైన దేవుడి ప్రతిమలకు కొంతైనా నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది.

సో, విగ్రహానికి స్పూన్‌తో గాని గ్లాస్‌తో గాని నీరు లేదా పాలు తాకించినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ విగ్రహం నీటిని లాక్కుంటుంది. దీన్ని సైంటిఫిక్‌గా నిరూపించి చూపించారు. అప్పుడు గాని జనాలు చల్లబడలేదు. సర్ఫేస్ టెన్షన్‌ అనే ప్రక్రియ వల్ల అలా జరుగుతుంది గాని దేవుడు పాలు తాగడం అనేది ఉండదని చెప్పారు. కావాలంటే.. ఏ బంగారంతోనో, వెండితోనో తయారుచేసిన విగ్రహాలకు తాగించి చూడండి. పాలు, నీళ్లు తాగడం అనేదే కనిపించదని చెబుతున్నారు.

ఈ విషయం తెలిసినా సరే వేలంవెర్రిగా జనం పాల ప్యాకెట్లతో పరిగెడుతున్నారు. రీసెంట్‌గా కర్నూలు జిల్లా కోడుమూరులోని చిన్నబోయవీధిలో శివాలయం ఉంది. ఎదురుగా ఉండే నందీశ్వరుడు పాలు తాగుతున్నాడంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి నందీశ్వరుడికి పాలు తాగించడం మొదలుపెట్టారు.

కర్నూలులో నంది పాలు తాగాడు కదా అని.. మిగతా ప్రాంతాల్లో కూడా ప్రయత్నించారు. అలా అనంతపురం జిల్లా హిందూపురంలో వర్కౌట్‌ అయింది. సేమ్ టు సేమ్‌ కొన్నేళ్ల క్రితం ఎలా అయితే వినాయకుడు పాలు తాగుతున్నాడనే సరికి రాష్ట్రంలోని అన్ని విఘ్నేశ్వరాలయాలకు భక్తులు ఎలా పరుగులు తీశారో.. ఇప్పుడు కూడా అలాగే జరిగింది.

ప్రతి శివాలయానికి క్యూ కట్టి నందీశ్వరునికి పాలు తాగించడం మొదలుపెట్టారు. హిందూపురం నియోజకవర్గంలోని హస్నాబాద్‌లో అలా పాలు తాగే నందీశ్వరుడు కనిపించాడు. అంతే.. ఇక్కడికి కూడా జనం తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. దేవుడి విగ్రహాలు పాలు తాగడం అనేది జరగదని, అది భౌతికశాస్త్రం పరంగా జరిగే ఒక ప్రక్రియ అని చెబుతున్నారు జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు.

Tags

Read MoreRead Less
Next Story