నయా ట్రెండ్.. పెళ్లి పత్రికతో పాటు ఇంటికి పసందైన విందు భోజనం..!
"పెళ్లంటే.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే.. ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు'' అంటూ ఓ సినీ గేయ రచయత చెప్పినట్లు.. ఒక్కప్పుడూ పెళ్లనగానే.. ఆకాశమంత పందిళ్లు.. మిలమిల మెరిసే మండపాలు.. భాజాభజంత్రీలు.. బంధుమిత్రులతో పెళ్లి వేడుక జరిగే వీధంతా సందడి సందడిగా ఉండేది. ఇక పల్లెటూరిలో ఒకరింట్లో పెళ్లంటే ఊరంతా సందడి.. తమ ఇంట్లో పెళ్లి జరిగినట్లుగా అంతా భావించేవారు! కానీ ఇది సోషల్ మీడియా కాలం. వాట్సాప్‌లో ఆహ్వానం వెళ్తే.. నెట్టింట్లో డిటిజల్ అక్షింతలు చల్లుతున్నారు. దీనికి తోడు కరోనా మహమ్మారి వచ్చి పెళ్లి వేడుకలను మొత్తం మార్చేసింది. ఈ మహమ్మారి కారణంగా శుభలేఖలు.. పెళ్లి విందుల్లో కూడా మార్పులు వచ్చాయి. పెళ్లికి రాకుండానే పసందైన విందు భోజనం ఆరగించే సరికొత్త పద్ధతికి కరోనా తెరతీసింది. దీనికి సాక్ష్యంగానే తాజాగా ఓ పెళ్లి పత్రిక నెట్టింట్లో వైరల్‌గా మారింది.
పెళ్లికి మీరు రానవసరం లేదు.. వెబ్‌కాస్ట్‌లో జాయిన్ అయి పెళ్లి చూస్తూ ఎంచక్కా విందు భోజనం ఆరగించవచ్చు అనట్లు ఉంది ఆ పత్రిక. ఎందుకంటే పెళ్లి పత్రికతో పాటు.. విందు సరుకులను మీ ఇంటికి పార్సిల్‌లో పంపించేస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నమాట. అంతేనా విందులో ఏమేం ఉంటాయి.. అవి మీ వద్దకు ఎలా చేరుతాయి అనేది ముందుగానే వాట్సప్‌లో పంపిస్తున్నారు. మీకు కూడా ఇలాంటి ఆహ్వానం అందితే.. టీవీకో, లాప్‌టాప్‌కో కనెక్ట్ అయి పెళ్లిని తిలకిస్తూ హాయిగా విందు ఆరగించి.. నూతన వధూవరులపై నాలుగు డిజిటల్ అక్షింతలు చల్లితే సరి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com