DRUGS CASE: స్మగ్లర్లను రక్షించిన ఎలుకలు

DRUGS CASE: స్మగ్లర్లను రక్షించిన ఎలుకలు
22 కేజీల గంజాయిని తినేసిన ఎలుకలు... సాక్ష్యాలు లేకపోవడంతో కేసును కొట్టేసిన కోర్టు.. మూషికాల వల్ల బయటపడ్డ నిందితులు....

అక్రమంగా గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులను ఎలుకలు రక్షించాయి. ఇక తమకు కోర్టు శిక్ష విధిస్తుందని భయంతో వణికిపోయిన నిందితులను మూషికాలు కాపాడేశాయి. ఎలుకలు చేసిన పనికి పోలీసులు తలలు పట్టుకున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

రెండేళ్ల క్రితం మెరీనా బీచ్ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నారని రాజగోపాల్, నాగేశ్వరరావు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ చెన్నై హైకోర్టు పరిధిలోని మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఆ ఇద్దరు నిందితుల నుంచి 22 కేజీల గంజాయి పట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. అందులోనుంచి 50 గ్రాములను మాత్రం పరీక్షల నిమిత్తం నార్కోటిక్ విభాగానికి పంపించారు. పోలీసుల దగ్గర 21 కేజీల 900 గ్రాములను భద్రపరిచామని తెలిపారు. ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో సాక్షదారాలుగా పట్టుకున్న గంజాయిని చూపించాల్సి వచ్చిన సమయంలో పోలీసులు.. మొత్తం 21 కేజీల 900 గ్రాముల గంజాయికి బదులు 11 కేజీలు మాత్రమే చూపించారు.


తీర్పు చెప్పేముందు ఎవిడెన్స్ చూపాల్సిందిగా పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. అప్పుడు పోలీసులు 22 కేజీల్లో కేవలం 50 గ్రాముల గంజాయిని మాత్రమే చూపించారు. మిగిలిన మొత్తం ఎక్కడా అని జడ్జీ ప్రశ్నించగా.. స్వాధీనం చేసుకున్న మొత్తం 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పోలీసులు తెలిపారు. దీంతో విచారణ సమయంలో సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టు.. కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు రాజగోపాల్, నాగేశ్వర రావులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఎలుకలు చేసిన పనికి పోలీసులకు మొట్టికాయలు వేసింది.

నిజంగానే గంజాయిని ఎలుకలు తినేస్తున్నాయా? గంజాయిని భద్రపరచడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారా? ఎలుకల పేరు చెప్పి పట్టుకున్న గంజాయిని బయటకు పంపించి.. సొమ్ము చేసుకుంటున్నారా? అన్న అనుమానాలు.. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం వైరల్‌గా మారింది. ఇప్పటికే పలు కేసుల్లో ఎలుకలు మద్యం తాగాయని, డ్రగ్స్‌ తినేశాయని చెప్పి ఎందరో నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు చైన్నైలో కూడా అచ్చం అలాగే జరిగింది మరి. ఏదీ ఏమైనా మూషికాల పుణ్యమా అని గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story