Roger Federer: ఆటలోనే కాదు.. పాటలోనూ..

Roger Federer: ఆటలోనే కాదు.. పాటలోనూ..
సంగీత కచ్చేరీలో కనిపించి ఆశ్చర్యపరిచిన రోజర్‌ ఫెదరర్‌... పండగ చేసుకుంటున్న అభిమానులు....

టెన్నీస్‌ ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్‌... తనలోని మరో కళను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇప్పటివరకూ రాకెట్‌ చేతబట్టి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ టెన్నీస్‌ మ్యాస్ట్రో... ఇప్పుడు తన గాత్రంతో సంగీత ప్రపంచంలో అడుగు పెట్టాడు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ లో బ్రిటీష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే నిర్వహించిన సంగీత కచేరీలో పాల్గొన్నాడు. మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ ప్రపంచ పర్యటనలో భాగంగా ఈ రాక్ బ్యాండ్ చాలా మంది అతిథులను తమతో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. బ్రూస్ స్ప్రింగ్‌ స్టీన్, లారెన్ మేబెరీ, క్రెయిగ్ డేవిడ్, లూప్ ఫియాస్కో వంటి ప్రముఖులు అందరూ ఈ సంగీత కచేరీలో భాగమయ్యారు. ఈసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏస్‌ కింగ్‌ రోజర్‌ ఫెదరర్‌ ఇందులో పాల్గొన్నాడు.


బ్రిటీష్ రాక్ బ్యాండ్ ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్, గిటారిస్ట్ జానీ బక్‌లాండ్, బాసిస్ట్ గై బెర్రీమాన్, డ్రమ్మర్ విల్ ఛాంపియన్‌లతో కలిసి రోజర్ ఈ మ్యూజికల్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ప్రదర్శనకు ముందు క్రిస్ మార్టిన్ ఫెదరర్‌ను తమ బృంద సభ్యుడిగా ఆహుతులకు పరిచయం చేశాడు. ఈ ఫొటోలను ట్వీట్‌ చేసిన టెన్నీస్‌ దిగ్గజం.. అడ్వెంచర్ ఆఫ్ ఎ లైఫ్‌టైమ్ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాను దున్నేస్తున్నాయి. నెట్‌ ప్రపంచంలో ట్వీట్లు, రీట్వీట్లతో చిత్రాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. రోజర్‌ మీరు చేయలేనిది ఇంకేమైనా ఉందా అని అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. టెన్నీస్‌కు రిటైర్మెంట్‌ తర్వాత ఇదే ఉత్తమ జీవితం అంటూ మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

Tags

Next Story