Thailand: స్టార్‌ ఫిష్‌తో సెల్ఫీ.. చైనా టూరిస్టులకు జైలు

Thailand:  స్టార్‌ ఫిష్‌తో సెల్ఫీ.. చైనా టూరిస్టులకు జైలు
థాయిలాండ్‌లో స్టార్‌ ఫిష్‌తో సెల్ఫీ దిగిన చైనా టూరిస్టులకు జైలు శిక్ష... మరికొందరి కోసం కొనసాగుతున్న వేట

ఏ దేశానికైనా విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి నిబంధనలను తప్పక తెలుసుకోవాలి. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. థాయిలాండ్‌లో విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు చైనీయులు సరదాగా చేసిన పని వారిని జైలుకు పంపింది. ఇంతకీ ఏం జరిగిందంటే చైనాకు చెందిన సంయాంగ్ క్విన్, వెన్ జాంగ్‌లు థాయిలాండ్‌కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కోహ్ రాచా యాయ్‌ బీచ్‌లో ఈ ఇద్దరు చైనా టూరిస్టులు డైవింగ్‌ చేస్తూ సందడిగా గడిపారు. పగడపు దిబ్బలపై అడుగులు వేస్తూ... స్టార్ ఫిష్‌లను పట్టుకుని సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా ఆ చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.


ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి.. థాయిలాండ్‌ సముద్ర రక్షణ అధికారులకు చేరాయి. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. థాయిలాండ్‌లో ఇలా స్టార్‌ ఫిష్‌లను పట్టుకొని ఫొటోలు దిగడం నేరం కావడంతో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో తాము స్టార్‌ ఫిష్‌లతో ఫొటోలు దిగినట్లు ఈ చైనా టూరిస్టులు అంగీకరించారు. సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో సంయాంగ్ క్విన్, వెన్ జాంగ్‌లకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించారు. మరికొందరు ఇలా స్టార్‌ ఫిష్‌లతో ఫొటోలు దిగారన్న సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించేందుకు థాయిలాండ్ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పగడపు దిబ్బలు, అంతరించిపోతున్న సముద్ర జాతులను రక్షించడానికి ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు.

Tags

Next Story