Supreme Court: 41 ఏళ్లలో ఒకరిపై ఒకరు 60 కేసులు.. ఇదీ ఆ భార్యాభర్తల వ్యవహారం..
Supreme Court: కోర్టు కేసులంటే తొందరగా తేలే వ్యవహారం కాదని అందరూ అంటుంటారు. కానీ కొందరు మాత్రం అలా కోర్టుల చుట్టూ తిరగడానికి కూడా విసిగిపోరు. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారని ఈ భార్యభర్తలను చూస్తే తెలుస్తోంది. వారికి పెళ్లయి 30 ఏళ్లు అయ్యింది. వారు విడిపోయి 11 ఏళ్లు అయ్యింది. కానీ ఒకరిపై ఒకరు 60 కేసులు పెట్టుకున్నారు. ఇది విని సుప్రీంకోర్టు ధర్మాసనమే ఆశ్చర్యపోయింది.
కొన్ని వివాదాలు ఇట్టే పరిష్కారం కావని, ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగడానికే వారు ఇష్టపడతారని సుప్రీం కోర్టు తెలిపింది. ఒక్కరోజు కోర్టును చూడకపోతే, ఆ రోజు వారికి నిద్ర పట్టదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే ఆ భార్యాభర్తల మధ్య వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేలా మధ్యవర్తిత్వానికి వెళ్లడం మంచిదని దంపతుల తరఫు న్యాయవాదులకు తెలిపింది కోర్టు. మధ్యవర్తిత్వం వల్లే ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు మరే ఇతర కేసుల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com