Monkey Revenge: పగబట్టింది పాము కాదు కోతి.. 22 కిలో మీటర్ల దూరంలో వదిలిపెట్టినా..

Monkey Revenge: పగబట్టింది పాము కాదు కోతి.. 22 కిలో మీటర్ల దూరంలో వదిలిపెట్టినా..
X
Monkey Revenge: పాములు పగబడతాయంటారు.. కానీ కోతులు కూడా పగబడతాయన్న విషయం వింటే ఆశ్చర్యం కలగక మానదు.

Monkey Revenge: పాములు పగబడతాయంటారు.. కానీ కోతులు కూడా పగబడతాయన్న విషయం వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఓ వ్యక్తిని కోతి పగబట్టింది.. 22 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్లి వదిలేసినా మళ్లీ వచ్చి అతడిని పట్టుకుంది. దీంతో ఆ వ్యక్తి కోతి తనను చంపేస్తోందేమో అని భయపడిపోతున్నాడు.. ఈ విచిత్ర సంఘటన కర్ణాటకలో జరిగింది. చిక్కమంగలూర్ జిల్లాలోని కొట్టిఘెహరా అనే గ్రామంలో ఓ కోతి స్థానికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.

ఇళ్ల మీదున్న పెంకులను పడేయడం, ఇంట్లోకి చొరబడి పండ్లు, కూరగాయలు ఎత్తుకెళ్లడం, పెరట్లో ఆరేసిన బట్టలు లాగి చించి పడేయడం, పర్సులను దొంగిలించడం వంటివన్నీ చేసేది. దీంతో గ్రామస్థులు దాన్ని ఊరి నుంచి తరిమికొట్టడానికి శతవిధాల ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఎంత కొట్టినా మళ్లీ వచ్చేది. ఈ మధ్య పిల్లలకు స్కూల్స్ తెరవడంతో వారి వెంట కూడా పడి వేధించేది. చేసేది లేక గ్రామస్ధులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

కోతిని పట్టుకోవడానికి వచ్చిన అధికారులను సైతం ఇబ్బందికి గురిచేసింది. దీంతో వాళ్లు కూడా కోతిని పట్టుకోలేకపోయారు. కానీ అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ జగదీశ్.. అల్లరి కోతిని పట్టుకునేందుకు అధికారులకు సహకరించాడు. అధికారులు వానరాన్ని బంధించారు. కానీ కోతి వాళ్లనుంచి తప్పించుకుంది. తనను పట్టించిన జగదీశ్‌పై పగబట్టింది. దీంతో భయపడిపోయిన జగదీశ్ ఆటోలో దాక్కున్నాడు. అయినా కూడా ఆటో ఎక్కి పైన టాప్ అంతా చించి, లోపల సీట్లు చించి నానా భీభత్సం చేసింది.

జగదీశ్ చెవులు కొరికి, జుట్టు పీకింది. గమనించిన స్థానికులు దానిని అక్కడ నుంచి తరిమారు. అతి కష్టం మీద ఆ వానరాన్ని మళ్లీ బంధించి ఊరికి 22 కిలోమీటర్ల దూరం ఉన్న ఓ అడవిలో వదిలేసి వచ్చారు. దీంతో బతుకు జీవుడా అని అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

కానీ జగదీశ్‌పై పగ చల్లారని కోతి అడవి నుంచి మళ్లి ఊరిలోకి వచ్చింది. జగదీశ్ జాడ కూడా ఊరంతా వెతికింది. కోతిని గమనించిన స్థానికులు జగదీశ్‌కు సమాచారాన్ని చేరవేశారు. దీంతో భయపడిపోయిన అతడు కోతికి కనబడకుండా దాక్కున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు కోతిని బంధించారు. ఆ కోతి మళ్లీ ఎప్పుడొచ్చి ఏం చేస్తుందో అని జగదీశ్ బిక్కు బిక్కు మంటూ రోజులు గడుపుతున్నాడు.

Tags

Next Story