Beggar Funeral: యాచకుడి మృతికి సంతాపం.. అంత్యక్రియల్లో పాల్గొన్న వేల మంది జనం..

Beggar Funeral: యాచకుడి మృతికి సంతాపం.. అంత్యక్రియల్లో పాల్గొన్న వేల మంది జనం..
X
Beggar Funeral: ఓ బిచ్చగాడు కూడా అంతటి ప్రేమా ఆప్యాయతలు సంపాదించాడంటే.. అతడు ఆ నగర వాసులకు ఏమిచ్చి ఉంటాడు..

Beggar Funeral: ఎలా బతికామన్నది కాదు.. ఎలా మరణించామన్నది ముఖ్యం. మనం ఉన్నా లేకపోయినా మన గురించి నలుగురూ నాలుగు మంచి మాటలు మాట్లాడుకోవాలి. బ్రతికున్నప్పుడు నువ్వు నలుగురికీ చేసిన సాయం, నీ ప్రవర్తన, నీ నడవడిక మీద ఆధారపడి ఉంటుంది.

ఓ బిచ్చగాడు కూడా అంతటి ప్రేమా ఆప్యాయతలు సంపాదించాడంటే.. అతడు ఆ నగర వాసులకు ఏమిచ్చి ఉంటాడు.. పైగా అతడు తీసుకునేది ఒక్క రూపాయి మాత్రమే.. అదే వారి హృదయాల్లో స్థానం సంపాదించడానికి కారణమైంది.

కర్ణాటకలో మానసిక వికలాంగుడైన యాచకుడి మృతి పట్ల వేలాది మంది సంతాపం వ్యక్తం చేశారు. బళ్లారి జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మానసిక వికలాంగుడికి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బళ్లారి సమీపంలోని హడగలి పట్టణంలోని 45 ఏళ్ల మానసిక వికలాంగ బిచ్చగాడు బసవ అకా హుచ్చా బస్యాతో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉన్నారు. ఆయనకు అన్నదానం చేస్తే అదృష్టం వస్తుందని నమ్మారు. శనివారం రోడ్డు ప్రమాదంలో హుచ్చ బస్య మృతి చెందడంతో, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. అతడి అంత్యక్రియలకు వేలాది మంది హాజరయ్యారు. నగర ప్రజలు వీధుల్లో బ్యానర్లు కూడా పెట్టారు.

ఆర్టీరియల్ రోడ్లపై బ్యాండ్ వాద్యాలతో అతని మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అతడితో తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడి మృతికి సంతాపం ప్రకటించారు. హుచ్చ బస్యను ప్రజలంతా "అప్పాజీ" (తండ్రి) అని పిలుచుకునేవారు.

అతడు ప్రజల వద్ద నుండి 1 రూపాయి మాత్రమే భిక్షగా స్వీకరించేవాడు. అంతకు మించి ఇవ్వాలనుకున్నా తీసుకునేవాడు కాదు.. ఎక్కువ ఇచ్చినా తిరిగి ఇచ్చేసేవాడు. బలవంతం చేసినా ఎక్కువ డబ్బు తీసుకునే వాడు కాదు అని హుచ్చ బస్య గురించి మాట్లాడుకుంటున్నారు బళ్లారి నగర వాసులు.

మాజీ ఉపముఖ్యమంత్రి దివంగత ఎంపీ ప్రకాష్‌, మాజీ మంత్రి పరమేశ్వర నాయక్‌కు సుపరిచితుడైన ఆయన రాజకీయ నాయకులందరితో ఎలాంటి సంకోచం లేకుండా, అమాయకంగా మాట్లాడేవాడు. అతడు కనిపిస్తే మంచి జరుగుతుందని అనుకునేవారు. తలపెట్టిన కార్యం తప్పక నెరవేరుతుందని భావించేవారు.

హుచ్చ బస్యాకు దానం చేయడం తమ అదృష్టం అనుకునేవారు. అందుకే అతడి అంతిమసంస్కారాల్లో వేల మంది పాల్గొని తుది వీడ్కోలు పలికారు. హుచ్చబస్యకు ఘనమైన నివాళి అర్పించారు. బళ్లారి వాసుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన హుచ్చ బస్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

Tags

Next Story