ARTIFICIAL INTELLIGENCE: క్షణాల్లో కావాల్సిన కార్ డిజైన్లు, AI తో సాధ్యం
జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం టయోటా, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించుకుని కార్లను డిజైన్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. టయోటా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (TRI) అభివృద్ధి చేసిన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ ద్వారా దీనిపై పరిశోధనలు చేయనున్నట్లు తెలిపింది. టయోటా సాంప్రదాయ ఇంజినీరింగ్ విధానాలతో, అత్యాధునిక ఉత్పాదకత సామర్థ్యాలున్న ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ఈ విధానం జోడించగలదని తెలిపింది.
ఈ పరిశోధన విజయవంతం అయితే కార్ల డిజైన్ల విధానంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న టెక్ట్స్-టు-ఇమేజ్ జనరేట్ చేసే AI టూల్స్‌ని డిజైనర్లు వినియోగించుకోవచ్చని వెల్లడించింది. దీనిని ఉపయోగించి కేవలం అక్షరాలు, బొమ్మల రూపంలో డిజైన్లు గీయడం ద్వారా కావాల్సిన డిజైన్లను మనముందు క్షణాల్లో చూసుకునే అవకాశం కలగడమే కాకుండా, మన ఆలోచనలు, అవసరాలకు తగ్గట్లు మార్చుకోవచ్చు.
ఈ కొత్త సాంకేతికతను ఉపయోగించి, డిజైనర్లు తమ నమూనా డిజైన్లకు, ఇంజినీరింగ్ పరిమితులను జత చేసి, డిజైన్ ప్రక్రియలో మళ్లీ మళ్లీ చేసే పనులను తగ్గించవచ్చని తెలిపింది.
ఈ సాంకేతికతపై పనిచేసిన హ్యూమన్ ఇంటరాక్టివ్ డ్రైవింగ్ డివిజన్ టీం డైరెక్టర్ అవినాష్ బాలచంద్రన్ మాట్లాడుతూ.. "జెనరేటివ్ AI టూల్స్ వినియోగం డిజైనర్లకు ఉత్సాహం, ప్రేరణనిస్తాయి. కానీ అసలైన కార్ల డిజైన్లలో ఎదురయ్యే సంక్లిష్టమైన, భద్రత వంటి అంశాల్ని అవి పరిగణలోకి తీసుకోవు" అని వెల్లడించారు.
"టయోటాకి ఉన్న సాంప్రదాయ ఇంజనీరింగ్ బలాలను, ఉత్పాదక AI సాంకేతికతకి ఉన్న అత్యాధునిక సామర్థ్యాలతో ఈ టెక్నాలజీ మిళితం చేస్తుంది" అని ఆయన తెలిపారు.
టయోటా త్వరలో ఎలక్ట్రిక్ వాహనాన్ని(EV) రూపొందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేవలం 10 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తి చేసుకుని, 1,200 కి.మీ ప్రయాణించగల సామర్థ్యం ఉన్న EVని తయారుచేసేలా ప్లాన్ చేస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com