Uttar Pradesh : ఎందుకు ఆలస్యంగా వచ్చావ్ అన్నందుకు హెడ్‌మాస్టర్‌పై కాల్పులు...!

Uttar Pradesh : ఆలస్యంగా ఎందుకు స్కూల్ వచ్చావ్ అని అడిగినందుకు ఓ ఉపాధ్యాయుడు ఏకంగా హెడ్‌మాస్టర్‌పైకి కాల్పులకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటాహ్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో దిగేంద్ర ప్రతాప్ సింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలలో అరవింద్ కుమార్ ప్రధానోపాధ్యాయుడుగా ఉన్నారు.
అయితే గతకొద్దిరోజులుగా ప్రతాప్ సింగ్ పాఠశాలకు గైర్హాజరు అవుతున్నాడు.. ఈ విషయంలో అతనికి, ప్రధానోపాధ్యాయుడు అరవింద్ మధ్య పలుమార్లు వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలో మంగళవారం రోజున గైర్హాజరు అయిన రోజులకి కూడా వచ్చినట్టుగా రిజిస్టర్ లో ప్రతాప్ సింగ్ సంతకం చేశాడు. అయితే దీనిని అరవింద్ వ్యతిరేకించాడు. దీనితో ఆవేశంతో తన వద్ద ఉన్న లైసెన్స్ పిస్టల్‌తో అరవింద్ పై మూడుసార్లు కాల్పులు జరిపాడు ప్రతాప్.
అదృష్టవశాత్తు ఆ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నాడు అరవింద్. కాల్పులు జరిపిన తరువాత, ప్రతాప్ సింగ్ తుపాకీని చూపిస్తూ.. అరవింద్ పైన దుర్భాషలాడుతూ పాఠశాల నుండి వెళ్లిపోయాడు. తుపాకీ కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా పాఠశాలలో భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై ప్రాథమిక శిక్షా అధికారి (బిఎస్‌ఎ)కి సమాచారం అందడంతో ప్రతాప్ సింగ్ ని వెంటనే సస్పెండ్ చేశారు. ప్రతాప్ సింగ్ పైన కేసు నమోదు చేసి తుపాకీ లైసెన్సు రద్దు చేయాలని లేఖ రాస్తామని ఓ అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com